
ఇప్పట్లో అమలుకాని రైతు చట్టాలపై ఇప్పుడెందుకు యాగీ చేస్తున్నరని బీజేపీ నాయకురాలు విజయశాంతి ప్రతిపక్షాలను ప్రశ్నించారు. శాంతియుతంగా జరుగుతున్న రైతుల నిరసనలలో అల్లర్లు జరగడానికి కారణమెవరో ప్రజలకు తెలుసని ఆమె అన్నారు. చట్టాలను సంవత్సరం పాటు అమలు చేయమని చెప్పిన తర్వాత కూడా ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
‘రిపబ్లిక్ డే సంఘటనల వరకూ కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు కొనసాగిస్తూనే వచ్చింది. ఇరు పక్షాలూ ఎంతో సంయమనంతో వ్యవహరించాయి. ఇప్పటికే ప్రధానమంత్రిగారు చర్చలకు ఒక్క ఫోన్ కాల్‌తో అందుబాటులో ఉంటామని సానుకూల దృక్పథంతో ప్రకటిస్తే… రైతు సంఘాల నాయకులు మాత్రం వెనక్కి తగ్గుతారా లేదా గద్దె దిగుతారా? అని రాజకీయ శత్రువుల తీరుగా మాట్లాడటం శోచనీయం. ఇవి వారి మాటలా? లేదా వెనుక నుండి ప్రేరేపిత విరోధులు అనిపిస్తున్నారా? అని దేశ ప్రజలు ఆలోచిస్తున్నారు. అయినా, ఒకటిన్నర సంవత్సరాల పాటు అమలు కాని, అమలుకు రాని చట్టాలపై ఇప్పుడెందుకు ఇంత యాగీ పెట్టి ఆగం చేస్తున్నారు? ప్రభుత్వం ఫోన్ కాల్ దూరంలో చర్చలకు సిద్ధంగా ఉండగా… ఎందుకు ఈ ధోరణి ఎంచుకున్నట్లు?
జనవరి 26 పరిణామాల తర్వాత సమస్య ఇంకా ఇలాంటి ప్రకటనల వల్ల జఠిలమవుతూ వస్తుందే కానీ, పరిష్కారానికి దోహదపడటం లేదని రైతు సంఘాల నేతలు అర్థం చేసుకోవాలి. ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయి వ్యక్తులు కొందరు ఏ ప్రోద్బలంతో భారతదేశ అంతర్గత అంశంపై ట్విటర్ పోస్టింగులకు తెగబడుతున్నారో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. రహదారి అడ్డంకులు, ఢిల్లీ ఎర్రకోట సంఘటనల దృష్ట్యా తీసుకుంటున్న భద్రతాపరమైన జాగ్రత్తలు మాత్రమే. రైతు ఉద్యమంలోనే కొందరు మాకు తెలియకుండా ఎర్రకోట సంఘటనలకు పాల్పడ్డారని నేతలు చెబుతున్నప్పుడు, వారి నియంత్రణలో ఉద్యమం లేదని వారే ఒప్పుకున్నట్లు స్పష్టమైంది. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పోలీసులకే రక్షణ లేక దాడులతో దెబ్బలు తిన్నప్పుడు… తల్వార్ దాడులు జరుగుతున్నప్పుడు… ట్రాక్టర్లతో ఢీ కొట్టబడుతున్నప్పుడు… నిరసనలు అదుపు తప్పితే సాధారణ పౌరుల పరిస్థితి ఏమిటి? వారి ప్రాణాలకు హామీ ఎవరిస్తారు?’ అని బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్వీట్ చేశారు.
For More News..