
భువనేశ్వర్: ఒడిశాలోని పూరీ జిల్లా బాలాంగా ఏరియాలో ముగ్గురు దుండగులు పెట్రోలు పోసి తగులబెట్టిన టీనేజీ యువతిని ఆదివారం ఢిల్లీ ఎయిమ్స్కు ఎయిర్ ఆంబులెన్స్‌లో తరలించారు. ఎయిమ్స్ భువనేశ్వర్ లో చికిత్స పొందుతున్న బాధితురాలి కోసం పోలీసులు.. బిజూ పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వరకు గ్రీన్ చానెల్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఆమెను ఢిల్లీ ఎయిమ్స్ కు ఎయిర్ లిఫ్ట్ చేశారు. కాగా.. బాలికపై జరిగిన దాడితో తాను తీవ్రంగా కలత చెందానని ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ పేర్కొన్నారు.
కాగా, బాధితురాలు శనివారం తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా ముగ్గురు యువకులు బైక్ పై వచ్చి ఆమెను కిడ్నాప్ చేశారు. బాలాంగాలోని బయాబర్ గ్రామంలో భార్గవి నది ఒడ్డుకు తీసుకెళ్లి ఆమెపై పెట్రోలు పోసి తగులబెట్టి పారిపోయారు. స్థానికులు గమనించి మంటలు ఆర్పి బాలికను కాపాడారు.