గౌడ కులస్తులపై దాడులను అరికట్టాలి : అమరవేణి నర్సాగౌడ్

గౌడ కులస్తులపై దాడులను అరికట్టాలి : అమరవేణి నర్సాగౌడ్
  • కల్తీకి అందరినీ బాధ్యులను చేయడం సరికాదు

నిర్మల్, వెలుగు: కల్తీకల్లు పేరిట అమాయకులైన గౌడ కులస్తులపై ఎక్సైజ్ అధికారులు, పోలీసులు దాడులు చేయవద్దని టీజీఎస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, మోకుదెబ్బ అధ్యక్షులు అమరవేణి నర్సా గౌడ్ అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో గౌడ జన హక్కుల పోరాట సమితి, మోకుదెబ్బ ముఖ్య నేతల సమావేశానికి ఆయన చీఫ్​ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. ఇటీవల హైదరాబాద్​లో జరిగిన కల్తీ కల్లు మరణాల కుటుంబాలకు గౌడ సంఘాలుగా ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలియజేస్తున్నాయన్నారు. కల్తీ కల్లు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి వారిని ఆదుకోవాలని కోరారు. కల్లీ కల్లు ఘటనకు తరతరాల నుంచి కల్లు గీత వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న గౌడ కులస్తులందరినీ బాధ్యులను చేయొద్దని కోరారు. 

ఆ ఘటనను అడ్డుపెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అబ్కారీ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో కల్లు షాపులపై, గౌడ కులస్తులపై దాడులు చేస్తూ అక్రమ కేసులు పెట్టి వేధించడం సరికాదన్నారు. గౌడ కులస్తులను రాజకీయంగా ఎదుగకుండా వారి ములాలపై దెబ్బతీస్తూ లిక్కర్ లాబీకి తలొగ్గుతున్నారని, కల్లుపై కల్తీ పేరిట మీడియాలో ప్రచారం చేస్తూ వేధిస్తున్నారని ఆరోపించారు. దాడులను వెంటనే అపాలని,  లేకపోతే గౌడ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామన్నారు. సమావేశంలో మోకుదెబ్బ రాష్ట్ర కమిటీ సభ్యులు పడాల రాజేందర్ గౌడ్, కొండబాల గౌడ్, తీగల వెంకట్, జిల్లా ప్రధాన కార్యదర్శి శివ్వొల్ల రవీందర్, నాయకులు  శ్రీనివాస్ గౌడ్, గడ్డం మహేందర్, రాజేశ్వర్, మురళి, దేవేందర్ గౌడ్, అశ్విన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.