జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలాలలో గట్టు మల్లన్న స్వామి శివరాత్రి జాతర ఆదివారం వైభవంగా జరిగింది. గుట్టపై దొనలో కొలువైన గట్టు మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జాతరలో పోతరాజులు, లక్ష్మిదేవరల విన్యాసాలతో మల్లన్నగుట్ట పులకించింది. భక్తులు క్యూలైన్లో గంటలకొద్దీ నిలబడి స్వామిని దర్శించుకు న్నారు. సమీపంలోని గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి ఉపవాసాలతో బోనాలుపోసి, పట్నాలువేసి మొక్కులు చెల్లించుకొని స్వామికి నైవేద్యంగా సమర్పించారు.
జాతరకు సుమారు లక్షకుపైగా భక్తులు వచ్చినట్లు ఆలయ ఈవో రమేశ్ తెలిపారు. జైపూర్ ఏసీపీ.వెంకటేశ్వర్, సీఐ నవీన్ కుమార్, ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సీసీసీ కార్నర్కు చెందిన ప్రవీణ ఏజెన్సీస్ ఆధ్వర్యంలో 2 వేల మంది భక్తులకు అరటి పండ్లతోపాటు తాగునీరు అందజేశారు. గట్టు మల్లన్న పైన మొక్కులు చెల్లించుకున్న భక్తులు సోమవారం వేలాలలోని మల్లిఖార్జున స్వామిని దర్శించుకుంటారు.
జాతరలో గుండెపోటుతో భక్తుడు మృతి
వేలాల గట్టు మల్లన్న జాతరలో విషాదం చోటుచేసుకుంది. నస్పూర్ పట్టణానికి చెందిన భక్తుడు బింగి రాజేందర్(45) దర్శనానికి వచ్చి హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడు. గట్టు మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు రాజేందర్ కుటుంబసభ్యులతో కలిసి ఉదయాన్నే వేలాలకు వచ్చారు. కాలినడకన గుట్టపైకి ఎక్కుతుండగా వాటర్ ట్యాంక్ సమీపంలో రాజేందర్ కుప్పకూలాడు. కుటుంబసభ్యులు అక్కడి వైద్య సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే చేరుకున్న సిబ్బంది పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
