కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల సందడి

కొమురవెల్లి  మల్లన్న ఆలయంలో  భక్తుల సందడి

కొమురవెల్లి, వెలుగు: ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం కొమురవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. సుమారు 8 వేల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. శనివారం సాయత్రం నుంచే క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం ఉదయాన్నే కోనేరులో స్నానమాచరించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి  పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. కొంత మంది స్వామి వారి నిత్యకల్యాణంలో పాల్గొన్నారు. మరికొంత మంది కొండపైన రేణుక ఎల్లమ్మను దర్శించుకొని బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. 

మల్లన్న ఆలయంలో ఈ హుండీ ప్రారంభం

మల్లికార్జునస్వామి సన్నిధిలో ఈ హుండీలను ఆలయ ఈఓ అన్నపూర్ణ ప్రారంభించారు. బుకింగ్ కార్యాలయం, ప్రసాద విక్రయశాల, నిత్యాన్నదాన సత్రం నందు ఈ హుండీలను ఏర్పాటు చేశారు. కొమురవెల్లి ఎస్బీఐ బ్యాంకు వారు ఏర్పాటు చేసిన ఈ హుండీలో ఆలయ ధర్మకర్త జయప్రకాశ్ రెడ్డి మొదటగా రూ.10,116లు విరాళంగా వేశారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకుడు మహదేవుని మల్లికార్జున్, అర్చకులు మనోహర్, ఆలయ ఏఈవో శ్రీనివాస్, పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్ రెడ్డి, క్లర్క్  శ్రీనివాస్ రెడ్డి, నవీన్ పాల్గొన్నారు.