
- కిషన్ రెడ్డి, బండి సంజయ్ సంతాపం
హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామోజీ షణ్ముక చారి(63) అలియాస్ జన్నన్న శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. కొన్ని రోజులుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ కొత్తపేటలోని తన నివాసంలో మృతి చెందినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున నల్గొండ నుంచి షణ్ముక పోటీ చేశారు. నల్గొండ జిల్లాలో బీజేపీ బలోపేతానికి కృషి చేశారు.
కరీంనగర్ జిల్లా బీజేపీ ఇన్ చార్జ్‌గా కూడా పని చేశారు. ఎమర్జెన్సీ సమయంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత హిందూ వాహిని, భజరంగ్ దళ్‌ను కూడా విస్తరించడంలో కృషి చేసినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. షణ్ముక మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఇతర నేతలు సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. షణ్ముక మృతి రాష్ట్ర బీజేపీకి తీరని లోటని పేర్కొన్నారు.