
ప్రధాని నరేంద్ర మోడీ రామగుండం పర్యటన విజయవంతమైందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జీ. వివేక్ వెంకట స్వామి అన్నారు. సభకు వచ్చిన జనాన్ని చూసిన ప్రధాని కండ్లల్లో సంతోషం కనిపించిందన్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయమని ప్రకటించడం, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ రీ ఓపెనింగ్ చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. RFCL రీ ఓపెన్ కు వివేక్ వెంకటస్వామి ఎంతో కృషి చేశారని, తాను వివేక్ కలిసి ప్రధానిని చాలాసార్లు కలిశామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సభావేదికపై వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ముగిసింది. RFCLతో పాటు పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని పరిశీలించారు. ఫ్యాక్టరీకి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్టరీలో ఎరువుల తయారీకి సంబంధించి వివరాలను ఫ్యాక్టరీ అధికారులు ప్రధానికి తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ వెంట గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఉన్నారు.
ఆ తర్వాత NTPC మహాత్మాగాంధీ స్టేడియంలోని బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ మొత్తం నాలుగు ప్రాజెక్టులను జాతీకి అంకితం ఇచ్చారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ జాతికి అంకితం చేశారు. భద్రాచలం రోడ్ -సత్తుపల్లి రైల్వే లైన్ ను ప్రారంభించారు. మెదక్-సిద్ధిపేట-ఎల్కతుర్తి 2 లైన్ల రహదారి, బోధన్-బాసర-భైంసా 2 లైన్ల రహదారితో పాటు సిరొంచ-మహదేవ్ పూర్ 2 లైన్ల రహదారి విస్తరణ పనులు మొదలు పెట్టారు.