
అల్వాల్, వెలుగు: ప్రజాగాయకుడు గద్దర్‌కు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి నివాళులర్పించారు. సోమవారం సాయంత్రం అల్వాల్‌లోని గద్దర్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొని గద్దర్ పాడెను మోశారు.
ఎప్పుడూ ప్రజల కోసం పోరాడేవారు గద్దర్ ఎప్పుడూ ప్రజల కోసం, వారి హక్కుల కోసం పోరాడారని వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘‘గద్దర్ కమిట్ మెంట్ ఉన్న వ్యక్తి. ఒక నిర్ణయం తీసుకుంటే దాని కోసం ఎందాకైనా పోరాడ్తరు. గద్దర్‌ను మొదటిసారి నేను 40 ఏండ్ల కింద కలిసిన. మా నాన్న వెంకటస్వామితో కలిసి ఆయన ఉద్యమంలో పాల్గొనేవారు.
గద్దర్ ను కలిసిన తర్వాత నేను కూడా ఆయనకు అభిమాని అయిన. కాలేజీలో చదువుకునేప్పటి నుంచి మా నాన్నకు ఆయన తెలుసు. జాబ్ చేసేటప్పుడు మా ఇంటికి వచ్చేవారు. మా నాన్న కూడా పేదల కోసం కొట్లాడేవారని గద్దర్ చెప్తుండె” అని గుర్తుచేసుకున్నారు.
తెలంగాణ సాధనలో గద్దర్ పాత్ర చాలా కీలకమైందని, పాటలతో ప్రజలకు ఎంతో మెసేజ్ ఇచ్చారని తెలిపారు. గద్దర్ లేకపోవడం మనందరికీ తీరనిలోటని, ఆయన ఆశయాలతో ముందుకు పోవాలని పిలుపునిచ్చారు.