ఇదేనా తెలంగాణ తరీకా

ఇదేనా తెలంగాణ తరీకా

ఏడేండ్లలో ఏం సాధించినం.. అని ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాల్సిన టైమొచ్చింది. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించినప్పుడు అందరికీ ఎన్నో ఆశలు.. ఆకాంక్షలుండేవి. సమైక్య పాలనను ఎదిరించి ఉద్యమంలో కొట్లాడి గెలిచిన సంబురం ఆనాడు ఇంటింటా కనిపించింది. నిధులు, నీళ్లు, నియామకాలన్నీ మన సొంతమనే విక్టరీ​ఫీలింగ్ అది. కానీ, ఇప్పుడు తెలంగాణలో అటువంటి వాతావరణమే లేదు. భయానక, భీకర వాతావరణం నెలకొంది. ఎందరో యువకుల బలిదానాలు, సకల జనుల సమిష్టి పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. ఏడేండ్లయినా సమైక్య పాలనను నిందించటమే తప్ప సొంతంగా సాధించిందేమిటో చెప్పుకునే పరిస్థితి లేదు. అప్పుడు తెలంగాణ ట్యాగ్ లైన్​ అని చెప్పుకున్న నీళ్లు, నిధులు, నియామకాల స్లోగన్ ఇప్పుడు వినిపించటం లేదు. వాటి గురించి అడిగినోళ్లను అణి చేయటం.. నిలదీస్తే నిలువ నీడ లేకుండా చేసే అహంకార పాలన కొనసాగుతోంది. అధికార దాహం.. అవినీతి రాజ్యం.. కుటుంబ పాలన.. కేసీఆర్ హిడెన్ ఎజెండానే అమలవుతోంది.

మోసం
తెలంగాణ వచ్చినప్పటి నుంచి నోటిఫికేషన్లు.. కొత్త రిక్రూట్​మెంట్లు లేకపోవటంతో లక్షలాది మంది యువతీ యువకులు మోసపోయారు. గవర్నమెంట్ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన యువతతో ఖాళీలను, కొత్త ఉద్యోగాలను నింపాలనే సోయి మరిచిపోయింది. యూనివర్సిటీలను గాలికొదిలేసింది. దీంతో అటు ఉన్నత విద్యతోపాటు ఉద్యోగ నియామకాలకు నోచుకోక యువత ఉపాధికి తల్లడిల్లే పరిస్థితి నెలకొంది. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన టీఆర్ఎస్​ ప్రభుత్వం రెండేండ్లుగా మాయమాటలతోనే ఆ విషయాన్ని దాటేస్తోంది.

దగా
ఎస్సీ, ఎస్టీ స్పెషల్ ఫండ్, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, కేసీఆర్ దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ ఇలా ఏడేండ్లలో రకరకాల పేర్లు మారాయి. దళితులకు మూడెకరాల భూ పంపిణీ ఎందుకు పూర్తి కాలేదు? అందరికీ ఉచితంగా కరెంట్ ఇచ్చినం.. దళితులకు కూడా ఇచ్చినం.. ఇలాంటి టక్కుటమార లెక్కలు కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీలకు ప్రత్యేకంగా ఏమిచ్చిందో చట్ట సభల్లో  ప్రకటించాలి. గిరిజనులకు రిజర్వేషన్ల శాతం పెంచుతాం.. ఎక్కడ  పోడు భూములుంటే అక్కడ కుర్చీ వేసుకొని కూచొని పట్టాలిస్తామన్న కేసీఆర్.. ఎస్టీలపై ఎక్కడపడితే అక్కడ కేసులు పెట్టిస్తున్నారు. ఇదేనా.. గిరిజన సంక్షేమం?

దోపిడీ
తెలంగాణ రాష్ట్రంలో నిధులకు కొరత లేదు. ముమ్మాటికి మనది మిగులు రాష్ట్రమే. అలాంటి తెలంగాణ ఇప్పుడు అప్పులు కావాలని అడుక్కునే పరిస్థితికి వచ్చింది. రాష్ట్రం విడిపోయినప్పుడు రూ.70 వేల కోట్ల అప్పుంటే ఇప్పుడు రూ.4 లక్షల కోట్ల అప్పు ఎందుకైంది? ప్రభుత్వ ఆస్తులు, భూములు అమ్ముకుంటే తప్ప అభివృద్ధి సంక్షేమానికి నిధుల్లేని దుస్థితి. లక్ష కోట్ల అప్పుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ఎవరి కోసం? కొత్తగా ఒక్క ఎకరం ఆయకట్టుకు కూడా నీళ్లు రాకున్నా.. కొండ పోచమ్మ సాగర్​ నీళ్లు తీసుకెళ్లింది సొంత ప్రయోజనం కోసం కాదా?

నీళ్లతో నిప్పులు
పోతిరెడ్డిపాడు హెడ్​ రెగ్యులేటర్​ నుంచి ఆంధ్రప్రదేశ్​ నీళ్లను ఎత్తుకుపోతుందని.. ఉద్యమ టైమ్​లో గాయి గాయి చేసిన టీఆర్ఎస్.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు గండిని డబుల్ చేసినా సంగమేశ్వరం నుంచి కృష్ణా నీళ్లను ఖాళీ చేసినా ఎందుకు సైలెంటయింది. గోదావరి నీళ్లతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని కేసీఆర్ గొప్పలకు పోవుడు.. తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టుడు కాదా? తెలంగాణ ఖజానాను ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకేనా కొత్త ప్రాజెక్టులు.. రోజుకో తీరుగా డిజైన్ల మార్పు.. రివైజ్డ్ ఎస్టిమేట్లు..!

జనంతో చెలగాటం
కరోనాతో జనం చనిపోతుంటే.. ఆయుష్మాన్​ భారత్​ లో  ఫ్రీ ట్రీట్​మెంట్​ అందించేందుకు తీరిక లేని ప్రభుత్వం మనది. ప్రజలు  ఆపదలో ఉంటే పోలీసులను కాపలా పెట్టి సెక్రెటేరియెట్ కూలగొట్టడం, అసెంబ్లీని కూలగొట్టేందుకు ప్లాన్​లేయటం.. కొత్త బిల్డింగ్​లకు  పునాది రాయి వేయటం.. హైదరాబాద్​లో వరదలొచ్చి జనం మునిగిపోతుంటే.. ప్రగతిభవన్​లో కూచోని కాళేశ్వరం డిజైన్లు తయారు చేయటం.. ఇదేనా ప్రజలు కోరుకున్న బంగారు పాలన.

- వివేక్​ వెంకటస్వామి, మాజీ ఎంపీ, బీజేపీ కోర్​ కమిటీ మెంబర్