వ్యాక్సిన్‌‌కు వెయ్యి కోట్లు ఇయ్యలేరా?

వ్యాక్సిన్‌‌కు వెయ్యి కోట్లు ఇయ్యలేరా?
  • ఏటా వేల కోట్ల అప్పు తెస్తరు.. వ్యాక్సిన్‌‌కు వెయ్యి కోట్లు ఇయ్యలేరా
  • బీజేపీ కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులున్నందున అందరికీ ఫ్రీగా కరోనా వ్యాక్సిన్ వేసే ఏర్పాట్లు చేయాలని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ మెంబర్ జి.వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ రేట్లపై కేంద్రాన్ని నిందించేందుకు టైమ్ కేటాయిస్తున్న టీఆర్​ఎస్ లీడర్లు.. నిజాలు దాచిపెట్టకుండా రాష్ట్రంలో ప్రజల ప్రాణాలను కాపాడే చర్యలు చేపట్టాలన్నారు. ప్రాజెక్టుల కాంట్రాక్టర్ల కోసం ఏటా రూ.20 వేల కోట్లు అప్పు తెస్తున్న టీఆర్​ఎస్ ప్రభుత్వం, అత్యవసరమైన వ్యాక్సిన్ కొనుగోలుకు కేవలం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించే పరిస్థితి లేదా అని ప్రశ్నించారు. వ్యాక్సిన్​పై రాజకీయం చేయటం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనని అభిప్రాయపడ్డారు. 18 ఏండ్లు దాటిన అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా బాధితుల ట్రీట్​మెంట్​కు సరిపడే హాస్పిటళ్లున్నాయా, సరిపడే బెడ్లున్నాయా.. రోజుకు ఎంత మంది హాస్పిటళ్లలో చేరుతున్నారనే కనీస సమాచారం ప్రభుత్వం దగ్గర లేదని ఆరోపించారు. కేసులు, మరణాలు దాచిపెట్టిన కారణంగానే ఆక్సిజన్ కొరత, రెమ్డెసివిర్ ఇంజక్షన్ల కొరత తలెత్తిందని అన్నారు. అసలు నిజాలు బయటపడుతాయనే భయంతో తమ తప్పులన్నీ కేంద్ర ప్రభుత్వంపై నెట్టేస్తున్నారని విమర్శించారు.

ప్రైవేటు ఆసుపత్రుల్లో ట్రీట్​మెంట్​కు లక్షల రూపాయల ఫీజులు కట్టలేక కరోనా పేషెంట్లు అప్పులపాలైతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ స్కీమ్​లో కరోనాకు ఫ్రీ ట్రీట్​మెంట్ సదుపాయం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ స్కీమ్ ఇప్పటికీ రాష్ట్రంలో అమలు కావటం లేదన్నారు. కరోనాతో ఇప్పటికే చాలా కుటుంబాలు నష్టపోయాయని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజలను ఆదుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. మంత్రుల మాటలకు, ప్రభుత్వ చర్యలకు అసలు పొంతన లేకపోవటం చూస్తుంటే రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని అర్థమవుతోందన్నారు. ఒకవైపు కరోనా పెరుగుతుంటే ఎన్నికలు మాత్రం ఆపేది లేదని ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని, కేవలం రాజకీయాల కోసం ప్రజల ప్రాణాలను బలి పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.