
- తొమ్మిదో షెడ్యూల్ పెట్టేందుకు అభ్యంతరం లేదన్న కేంద్ర మంత్రి
- 42% నుంచి ముస్లింలను తొలగించాలంటున్న కిషన్ రెడ్డి
- 9వ షెడ్యూల్ పేరుతో కేంద్రంపై నిందలు వేయొద్దన్న రాంచందర్ రావు
- 42 శాతం రిజర్వేషన్ల హామీని ఎలా ఇచ్చారో అలానే అమలు చేయాలన్న బీజేపీ స్టేట్ చీఫ్
- అసెంబ్లీ తీర్మానానికి మద్దతు ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు
- మంత్రిపదవులను ప్రస్తావిస్తూ రఘునందన్ రావు విమర్శలు
హైదరాబాద్/ ఢిల్లీ: బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నేతలు తలోమాట మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, హామీ ఇచ్చినప్పుటు 42% రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదని తెలియదా..? అని విమర్శిస్తోంది. బీసీలను మోసం చేయాలని చూస్తోందని అంటోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానానికి మద్దతు పలికి ఇప్పుడు సాధ్యం కాదనడం గమనార్హం.
42% సాధ్యం కాదని భావిస్తే అప్పుడే ఎందుకు వ్యతిరేకించలేదని కాంగ్రెస్ అంటోంది. ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ 42శాతం రిజర్వేషన్లు బీసీలకు మాత్రమే ఇవ్వాలి. అందులోంచి ముస్లింలను తీసేయాలి. తొమ్మిదో షెడ్యూల్లో పెట్టేందుకు మాకు అభ్యంతరం లేదు కానీ చట్టానికి లోబడి ఉండాలి. ’ అని అన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముస్లింలకు బీసీ-ఈ కింద 4 శాతం రిజర్వేషన్లు కల్పించనప్పుడు హైకోర్టు ధర్మాసనం ఆ రిజర్వేషన్లు చెల్లవని రెండు సార్లు తీర్పును ఇచ్చిందన్నారు. దానిపై స్టే తీసుకొచ్చి 4 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోందని తెలిపారు. ఇప్పుడు ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లను 10 శాతానికి పెంచి బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు.
ఇటీవల బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చడం సాధ్యం కాదని, ఇప్పటికే తమిళనాడు కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని చెప్పారు. ఈ విషయం ముందే తెలిస్తే బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బిల్లును ఎందుకు వ్యతిరేకించలేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. బీసీలను మోసం చేస్తున్నది బీజేపీయేనని విమర్శిస్తోంది.
►ALSO READ | వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. పార్టీని గెలిపిస్తా: టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు
బీసీల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని అంటోంది. ఇవాళ ఉదయం బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో 10 శాతం లేని అగ్రకులాలకు 7 మంత్రి పదవులు ఎందుకు ఉన్నాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలంటున్నారు. 56 శాతం ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు.
బీజేపీ వైపుకు ఒక్క వేలు చూపెడుతున్న రేవంత్ రెడ్డి.. ఆయన వైపు 4 వేళ్లు చూపెడుతున్నాయని తెలుసుకోవాలన్నారు. శాస్త్రీయంగా కుల సర్వే నిర్వహించినప్పుడు ఎవరు ఎంతమంది ఉన్నారో.. పూర్తి వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా గవర్నర్ కు రాష్ట్ర కేబినెట్ పంపిన ఆర్డినెన్స్ ఇప్పుడు కేంద్ర హోంశాఖ వద్ద పెండింగ్ లో ఉందన్నారు.