హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్ జూనియర్ సివిల్ కోర్టును అటవీ ప్రాంతానికి తరలించే ప్రభుత్వ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం పార్టీ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఆర్డీవో ఆఫీసు ఏఓకు వినతిపత్రం సమర్పించారు. శంకర్ బాబు మాట్లాడుతూ కోర్టు తరలింపు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందన్నారు.
అటవీ ప్రాంతం ప్రజలకు అందుబాటులో ఉండదని తెలిపారు. నిత్య కార్యకలాపాల కోసం కోర్టుకు వచ్చే మహిళలు, వృద్ధులు, రైతులు తీవ్రంగా ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ మండల మాజీ అధ్యక్షుడు విద్యాసాగర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శులు రాంప్రసాద్, రాజేందర్ చారి, కార్యదర్శులు లక్ష్మయ్య, అరుణ్ కుమార్, సాయిరామ్, కోశాధికారి రాజు, బీజేపీ సీనియర్ నాయకులు అనంతస్వామి, శ్రీనివాస్, నరేశ్, శారద, శ్రీకాంత్, రాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
