పేపర్ లీకేజీపై భగ్గుమన్న బీజేపీ

 పేపర్ లీకేజీపై భగ్గుమన్న బీజేపీ

టీఎస్పీపీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై నిరుద్యోగులు, విద్యార్థులకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసుకు బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలన్నారు.  జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ముందు బీజేపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.  బీజేపీ నాయకులు తుల ఉమ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. కలెక్టరేట్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకి బీజేపీ శ్రేణులు ప్రయత్నించారు. దీంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా గ్రూప్ 1 అభ్యర్థులకు లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకు నిరసనగా హనుమకొండ జిల్లా కలెక్టరేట్ను ముట్టడించేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించారు. కలెక్టరేట్ వద్దకు చేరుకున్న బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, బీజేపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. దీంతో స్థానికంగా ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావుతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. లీకేజీ ఘటనపై  సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పార్లమెంట్ బీజేపీ ఇంఛార్జ్ బి. ప్రవీణ్ రావు డిమాండ్ చేశారు. లక్షలాది మంది నిరుద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోందని ఆరోపించారు.పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

టీఎస్పీపీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం, పబ్లిక్ కమిషన్ ఛైర్మెన్ కు వ్యతిరేకంగా శంషాబాద్ లో బీజేపీ ధర్నా చేపట్టింది. స్థానిక బస్టాండ్ వద్ద బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో  బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. 

TSPSC  పేపర్ల లీక్ కు నిరసనగా జనగామ కలెక్టరేట్ ముట్టడికి బీజేపీ నాయకులు యత్నించారు. బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. దీంతో బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

అటు పేపర్ లీకేజీ ఘటనపై మంచిర్యాల జిల్లా బీజేపీ నాయకులు భగ్గుమన్నారు. మంచిర్యాల కలెక్టరేట్ను బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా..పోలీసులను తోసేసి లోపలికి చొచ్చుకెళ్లారు. దీంతో  బీజేపీ నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో బీజేవైయం జిల్లా అధ్యక్షుడు పట్టి వెంకట కృష్ణ  చేయి విరిగింది. బీజేపీ నేతల ఆందోళనతో కలెక్టరేట్ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.