సంస్థలను నిందించడం మాని..నాయకత్వ వైఫల్యాలను అంగీకరించండి

సంస్థలను నిందించడం మాని..నాయకత్వ వైఫల్యాలను అంగీకరించండి
  • రాహుల్ గాంధీ ఓట్​ చోరీ ఆరోపణలపై బీజేపీ నేతల మండిపాటు

న్యూఢిల్లీ: రాజ్యాంగ సంస్థలపై ఆరోపణలు మానుకొని పార్టీ వరుస వైఫల్యాలకు బాధ్యత వహించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీజేపీ నేతలు హితవు పలికారు. ఎన్నికల కమిషన్​పై రాహుల్​ గాంధీ చేసిన ఆరోపణలపై శుక్రవారం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పదే పదే ఎన్నికల్లో ఓడిపోతున్నారు. 

మీ బలహీనతలను,  నాయకత్వ వైఫల్యాన్ని అంగీకరించాలి. కానీ, మీరు రాజ్యాంగ సంస్థలను నిందించడం కరెక్ట్​ కాదు” అని పేర్కొన్నారు. ఎన్నికల్లో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రాహుల్​ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. గాంధీ వ్యాఖ్యలు భారత వ్యతిరేక ప్రచారానికి అద్దం పడుతున్నాయని ఫైర్​ అయ్యారు. ఎన్నికల కమిషన్‌‌పై  రాహుల్ అనవసరమైన ఆరోపణలు చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానపరుస్తున్నారని, పదేపదే దేశ వ్యతిరేక ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు.

రాహుల్​కు రాజ్యాంగంపై నమ్మకం లేదు: ఫడ్నవీస్ 

 రాహుల్ గాంధీ "అర్బన్ మావోయిస్టు" లా మాట్లాడుతున్నారని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కలిసి రావాలని గాంధీ యువతను కోరారు. ఇది 'ఓటు చోరి' కాదు.. రాహుల్ గాంధీ మెదడు చోరీ అయింది. ఆయనకు రాజ్యాంగంపై నమ్మకం లేదు. అందుకే రాజ్యాంగ సంస్థలను తిరస్కరిస్తున్నారు" అని ఫడ్నవీస్ అన్నారు.

ప్రజాస్వామ్యంపై కుట్ర: రవిశంకర్ ప్రసాద్

దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఉద్దేశపూర్వకంగా బలహీనపరిచేందుకు రాహుల్ గాంధీ  కుట్ర చేస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు రవిశంకర్ ప్రసాద్  ఆరోపించారు. శుక్రవారం ఆయన పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ ​ఆరోపణలను తోసిపుచ్చారు. దేశంలో అరాచకాన్ని సృష్టించడానికి రాహుల్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.