టీఆర్ఎస్ తొత్తులుగా పోలీసులు

టీఆర్ఎస్ తొత్తులుగా పోలీసులు
  • సీఎం కేసీఆర్​బాధ్యత వహించాలె: ఈటల
  • ఇదే పని బీజేపీ చేస్తే మీ ఎమ్మెల్యేలు తిరగగలరా: రాజాసింగ్
  • మంత్రి రెచ్చగొట్టే మాటలతోనే దాడి: దాసోజు శ్రవణ్

హైదరాబాద్, వెలుగు: జనగామా జిల్లా దేవరుప్పలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై ఆదివారం ఉదయం టీఆర్ ఎస్ కార్యకర్తలు చేసిన దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన గుండాలను, మంత్రి దయాకర్ రావుపై పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. పోలీసులు టీఆర్ ఎస్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సంజయ్‌ టార్గెట్‌గా టీఆర్‌‌ఎస్ నాయకులు దాడి చేయడం దుర్మార్గం అని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సీఎం కేసీఆర్‌‌, మంత్రులు, టీఆర్‌‌ఎస్‌ నాయకులు చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ దాడులకు కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకుని, ఇకపై ఇలాంటివి జరగకుండా చేయాలని డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్‌‌ డైరెక్షన్‌లోనే సంజయ్​ పాదయాత్రపై దాడి జరిగిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న స్పందనను తట్టుకోలేక ఇసొంటి దాడులు చేయిస్తున్నారన్నారు. చేతకాని టీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్ పై దాడి చేశారని ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ఇలాంటి కుట్రలతో పాదయాత్రను ఆపలేరని హెచ్చరించారు. దాడి గురించి పోలీసులకు ముందే తెలుసని, బీజేపీ నేతలు వారిని హెచ్చరించినా పట్టించుకోలేదన్నారు. ఈ దాడిలో వారి హస్తం ఉందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఏం జరుగుతుందో చూడండని పోలీసులను హెచ్చరించారు. బీజేపీ ఇదే పని చేస్తే టీఆర్​ఎస్​ఎమ్మెల్యేలు తిరగగలరా అని ప్రశ్నించారు. 

సంజయ్ పాదయాత్రపై దాడిని ఖండిస్తూ, దాడికి ప్రోత్సహించిన మంత్రి దయాకర్ రావుపై హత్యాయత్నం కేసులు పెట్టాలని బీజేపీ నేత దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఇది టీఆర్ ఎస్ అరాచక, రాక్షస ప్రవృత్తికి నిదర్శనమని ఒక ప్రకటనలో తెలిపారు. పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి పెరుగుతున్న జనాదరణ చూసి తట్టుకోలేక ఈ రకమైన హింసకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దయాకర్ రావు పత్రిక సమావేశం పెట్టి మరీ బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకుంటాం అని రెచ్చగొట్టే ప్రకటన చేసి కుట్రపూరితంగా దాడి చేయించారన్నారు. సంజయ్ పాదయాత్ర సాఫీగా కొనసాగేలా పూర్తి రక్షణ కల్పించాలని డీజీపీని డిమాండ్ చేశారు.

సంజయ్‌పై దాడిని ఖండించిన పొంగులేటి

ప్రజా సంగ్రామ యాత్రపై దాడి చేయడం దారుణమని బీజేపీ తమిళనాడు రాష్ట్ర సహా ఇన్​చార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేకనే టీఆర్ఎస్ ఇటువంటి చేష్టలకు పాల్పడుతోందన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.