ఆ దాడి కేసీఆర్ చేయించినట్లే భావిస్తున్నాం

ఆ దాడి కేసీఆర్ చేయించినట్లే భావిస్తున్నాం

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొన్న అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై ఎంజే మార్కెట్ వద్ద టీఆర్ఎస్  పథకం ప్రకారం దాడికి యత్నించిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్  ఆరోపించారు.  ఈ ప్లాన్​ వెనుక  సీఎం కేసీఆర్  ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. శుక్రవారం బేగంపేట విమానాశ్రయంలో హిమంతకు ఈటల వీడ్కోలు  పలికారు. తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడారు. ఒక రాష్ట్ర సీఎం తెలంగాణకు వస్తే ఆయనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఇక్కడి ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు.

రాబోయే రోజుల్లో కేసీఆర్ కూడా బీహార్‌‌‌‌, యూపీ, ఇతర రాష్ట్రాలకు వెళ్తారని, ఆయనకూ అక్కడ  అలాంటి ఘటనలే ఎదురైతే ఏం సమాధానం  చెపుతారని ప్రశ్నించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్, ఇంటెలిజెన్స్ వ్యవస్థ అన్ని ఉన్నా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం కావాలని చేయించిందేనని ఫైరయ్యారు. హిమంతపై దాడికి యత్నించిన వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకోవాల్సిందేనని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. ఒక రాష్ట్ర సీఎంపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నిస్తే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.