కూతురు దురుసు ప్రవర్తన.. బీజేపీ ఎమ్మెల్యే క్షమాపణలు

కూతురు దురుసు ప్రవర్తన.. బీజేపీ ఎమ్మెల్యే క్షమాపణలు

కర్ణాటకలో అధికార పార్టీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలి మీడియా, పోలీసు అధికారులకు క్షమాపణలు చెప్పారు. ట్రాఫిక్ రూల్స్ కి విరుద్దంగా కారు నడిపిన లింబావలి కుమార్తెను ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. దీనితో అమె పోలీసులపై తిట్ల దండకం అందుకుంది. ఈ తతంగాన్ని అంతా షూట్ చేస్తున్న మీడియాపై కూడా అమె దురుసుగా ప్రవర్తించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే అరవింద్‌ తన కూతురు ప్రవర్తన పట్ల క్షమాపణలు చెప్పారు.

గత గురువారం ఎమ్మెల్యే కూతురు బీఎండబ్ల్యూ కారు నడుపుతూ ట్రాఫిక్ సిగ్నల్‌ను జంప్ చేసింది. దీనితో రూల్స్ పాటించనందుకు ట్రాఫిక్ పోలీసులు అమెకు రూ. 10, 000 ఫైన్ వేశారు. అయితే తాను ఎమ్మెల్యే అరవింద్ లింబావలి కూతుర్నినని, నా కారు ఎలా ఆపుతారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. తన వద్ద ఇప్పుడు డబ్బులు లేవని, ఫైన్ చెల్లించనని, తన కారును విడిచిపెట్టాలని  మొండికేసింది. ఈ ఘటనని రికార్డు చేస్తున్న మీడియా సిబ్బందిపై అమె ఫైర్ అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో లింబావలి  మీడియా, ట్రాఫిక్  పోలీసులకు క్షమాపణలు చెప్పారు.