రాష్ట్ర రైతులను వదిలేసి పంజాబ్ రైతులకు సాయమా?

రాష్ట్ర రైతులను వదిలేసి పంజాబ్ రైతులకు సాయమా?

యాదాద్రి భువనగిరి: సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతుల సమస్యను వదిలేసి పంజాబ్ రైతులకు సాయం చేయడాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తప్పుబట్టారు. తుర్కపల్లిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ముఖ్యమంత్రి వైఖరిపై ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీలో చేరగా.. ఈటల వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.

కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో ప్రజలకు అన్యాయం జరుగుతోందని, ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నాడని ఈటల ఆరోపించారు. రాష్ట్రాన్ని గాలి కొదిలేసిన సీఎం... పక్క రాష్ట్రాల్లో పర్యటిస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ధాన్యం సేకరణలో జాప్యంతో రాష్ట్ర రైతాంగం ఆగమైతుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం పక్క రాష్ట్రాల రైతులకు చెక్కులు పంపిణీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమస్యల వలయంలో చిక్కుకున్న రాష్ట్ర రైతులకు ముఖ్యమంత్రి ఎప్పుడు చెక్కులు ఇస్తారని ప్రశ్నించారు. 

ముందు రాష్ట్ర రైతులకు సాయం చేసి... తర్వాత దేశంలోని రైతుల గురించి ఆలోచించాలని హితవు పలికారు. వరి వేస్తే ఉరి అని కేసీఆర్ రైతులను వంచించగా.... తరుగు పేరుతో దళారులు రైతులను దోపిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కార్ అప్పుల్లో కూరుకుపోయిందన్న ఆయన... కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవని పేర్కొన్నారు. ఆదాయాన్ని పెంచుకునేందుకు మద్యంపైనే కేసీఆర్ పూర్తిగా ఆధారపడ్డారని, అందుకే ఇష్టం వచ్చినట్లు మద్యం ధరలు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక స్వరాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబమే బాగుపడ్డది తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఈటల పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తల కోసం...

కులాల మధ్య రేవంత్ చిచ్చుపెడుతున్నారు

తుంగభద్ర జలాశయం సరికొత్త రికార్డు