ప్రజలను బోల్తా కొట్టించడంలో కేసీఆర్ నెంబర్ వన్

ప్రజలను బోల్తా కొట్టించడంలో కేసీఆర్ నెంబర్ వన్

మెదక్: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ ఇంటికి పోవడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మోడీ పాలన ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సదస్సులో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎనిమిదేళ్ల పాలనలో ఎన్నో గొప్ప సంక్షేమ పథకాలను మోడీ ప్రవేశపెట్టారని కొనియాడారు. కాంగ్రెస్ హయాంలో ఎక్కడపడితే అక్కడ కుంభకోణాలు జరిగాయని, మోడీ పాలనలో కనీసం ఒక్క కుంభకోణమైనా జరిగిందా అని ప్రశ్నించారు. కరోనా సమయంలో దేశాన్ని మోడీ కాపాడిన తీరు ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుందన్నారు. ప్రజలను బోల్తా కొట్టించడంలో కేసీఆర్ నిష్ణాతుడని, ఆయన మాటలకు.. చేతలకు ఎలాంటి పొంతన ఉండదని ఈటల అన్నారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం అప్పుల పాలయిందని, రాష్ట్రంలోని ప్రతి వ్యక్తిపై రూ.1.25 లక్షల అప్పు భారం మోపారని మండిపడ్డారు. ఇష్టమొచ్చినట్లుగా ధరలు పెంచుతూ పేదల నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు.

మద్యంపై వచ్చే ఆదాయంతోనే రాష్ట్ర సర్కారు నడుస్తోందని, రాష్ట్రాన్ని తాగుడుకు బానిస చేశారని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ను సీఎం చేసిన పాపానికి ప్రజలు అనుభవిస్తున్నారని, అందుకే ఆయనంటే ప్రజలకు అసహ్యం కలుగుతోందన్నారు.  వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని అర్థమైనందునే కేసీఆర్ బీహార్ కు వెళ్లి రూ.600 కోట్ల కాంట్రాక్ట్ తో పీకేను తీసుకొచ్చుకున్నారని చెప్పారు. గోల్ మాల్ విద్యతో ప్రజలను  దోపిడీ చేసేందుకు పీకే లాంటి వారు పనికొస్తారే తప్ప... బాగు చేయడానికి కాదని స్పష్టం చేశారు. ఎంతమంది పీకేలు వచ్చినా కేసీఆర్ ఓటమిని ఆపలేరని... డబ్బు, సారా సీసాలకు రాష్ట్రంలో స్థానం లేదని చెప్పారు. కేసీఆర్ కు ఓటేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని టీఆర్ఎస్ నాయకులు బెదిరిస్తున్నారన్న ఆయన... కేసీఆర్ అవినీతిని ప్రశ్నించిన వాళ్లపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కు విశ్వసనీయత లేదని, కష్టపడితే బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.