సీఎం కేసీఆర్ పై ఈటల ధ్వజం

సీఎం కేసీఆర్ పై ఈటల ధ్వజం
  • మునుగోడులో టీఆర్​ఎస్​ ఓటమి ఖాయమని వెల్లడి
  • ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్

హైదరాబాద్, వెలుగు: ఆ నలుగురు ఎమ్మెల్యేలు పరమ పవిత్రులని, నిప్పు కణికలని సీఎం కేసీఆర్ అంటున్నారని, వారు ఆ పదాలకు ఎలా అర్హులవుతారో ప్రజలకు సమాధానం చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయన్నారు. మునుగోడులో ఓడిపోతున్నామని తెలిసి... దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన  మీడియాతో మాట్లాడారు. దేశాన్ని కాపాడే బాధ్యత న్యాయవ్యవస్థ, ప్రజలు, యువత, మీడియా మీద ఉందంటూ కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడిందనే విషయాన్ని  కేసీఆర్ మర్చిపోయి చక్రవర్తిలా రాజ్యం నడుపుతున్నారని విరుచుకుపడ్డారు. తెలంగాణను కేసీఆర్ అపహాస్యం చేశారని, మన గౌరవాన్ని మట్టిలో కలిపారని ఫైర్ అయ్యారు. 

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను ఖతం పట్టించిండు   

రెండోసారి అధికారంలోకి వచ్చాక 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను ఖతం పట్టించేందుకు ఆ పార్టీకి చెందిన  12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని పేర్కొన్నారు. చట్టంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని చేరికలకు తెరలేపింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో...ఓడిపోయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని కూర్చోబెట్టుకొని సంక్షేమ పథకాల చెక్కులను మంత్రులు అందిస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చెయ్యడం కాదా? అని నిలదీశారు. పార్టీ మారిన వారికి మంత్రి పదవి ఇచ్చావు... ఇదేం ప్రజాస్వామ్యం అని కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.

మేము కూడా నివేదికలు పంపిస్తం..

మేము కూడా న్యాయమూర్తులకు, ముఖ్యమంత్రులకు, యూనివర్సిటీల వీసీలకు  కేసీఆర్ ఎనిమిదేండ్ల నియంతృత్వ పాలన, ఎమ్మెల్యేల చేరికల మీద నివేదికలు పంపిస్తామన్నారు. తెలంగాణ రాగానే టీవీ చానళ్ల మీద నిషేధం విధించారని, మీడియా సంస్థలను లొంగదీసుకోవడం వాస్తవం కాదా? కేసీఆర్ స్క్రిప్ట్ ను చూపిస్తున్న చానళ్లు లేవా? అని దుయ్యబట్టారు.  కేటీఆర్ 30 వేల ఓట్ల మీద కన్నేసి..ఈ నెల 2 న ఎల్బీ నగర్ లో మీటింగ్ పెట్టి రెగ్యులరైజేషన్ చేస్తానని హామీ ఇచ్చారని,  ఇది ప్రలోభ పెట్టడం కాదా అని నిలదీశారు. మునుగోడులో  ఒక తండా వాసులకు కేటీఆర్ ఫోన్ చేసి మాకు ఓట్లు వేయండి... అభివృద్ధి చేస్తామని చెప్పడం ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడం కాదా అని ఫైర్ అయ్యారు.