- కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్,వెలుగు: కొత్త ఏడాది అధికారులంతా సమష్టిగా పనిచేస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కొత్త సంవత్సరం సందర్భంగా సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో కలిసి కలెక్టర్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, సంఘాల నాయకులు కలిసి న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. అనంతరం టీఎన్జీవో, టీజీవో సంఘాల క్యాలెండర్లను ఆవిష్కరించారు.
గ్రీవెన్స్‌లో మిడ్ మీల్స్ కార్మికుల నిరసన
కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో మిడ్ డే మీల్స్ కార్మికులు నిరసన తెలిపారు. తాము పుస్తెల తాళ్లు అమ్మి.. ఆ డబ్బుతో విద్యార్థులకు కోడి గుడ్లు అందజేశామని, ఇప్పటికీ తమకు బిల్లులు రాలేదని ఆరోపించారు. అంతకుముందు కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ పాల్గొని 299 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబు,తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
జగిత్యాల టౌన్, వెలుగు: ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సత్య ప్రసాద్ అధికారులను అదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 55 ఫిర్యాదులను అడిషనల్ కలెక్టర్లు లత, రాజగౌడ్, ఆర్డీవోలతో కలిసి స్వీకరించారు. అనంతరం ధరూర్ క్యాంపులోని ఈవీఎం గోదాములను భద్రపరిచిన యంత్రాల భద్రత, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు.
