డేరా బాబాకు 6 సార్లు పెరోల్.. మాజీ జైలు అధికారికి బీజేపీ టికెట్

డేరా బాబాకు 6 సార్లు పెరోల్.. మాజీ జైలు అధికారికి బీజేపీ టికెట్

న్యూఢిల్లీ: వచ్చే నెలలో హర్యానాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో డేరా సచ్చా సౌదా చీఫ్, అత్యాచార కేసులో దోషి గుర్మీత్ రామ్ రహీమ్‌(డేరా బాబా)కు 6 సార్లు పెరోల్ మంజూరు చేసిన మాజీ జైలు అధికారి సునీల్ సంగ్వాన్‏కు బీజేపీ టికెట్​ కేటాయించింది. 67 మంది అభ్యర్థులతో కూడిన ఫస్ట్ లిస్టును బీజేపీ గురువారం విడుదల చేసింది. అందులో  సునీల్ సంగ్వాన్ దాద్రీ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రకటించింది. ఇద్దరు శిష్యులపై అత్యాచారం చేసిన కేసులో డేరా బాబాకు 20 ఏండ్ల జైలు శిక్ష పడింది. 

ప్రస్తుతం అతడు హర్యానాలోని సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడు గత నాలుగేండ్లలో 10 సార్లు పెరోల్​పై బయటకు వచ్చాడు. అందులో ఆరు సార్లు సునీల్ సంగ్వాన్ అతనికి పెరోల్ మంజూరు చేశారు. కాగా, ఇటీవల సునీల్ సంగ్వాన్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అతనికి బీజేపీ టికెట్​కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. మాజీ బీజేపీ నాయకుడు సోమ్‌వీర్ సంగ్వాన్ 2019లో దాద్రీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం సునీల్కు దాద్రీ టికెట్‌ కేటాయిస్తే సోమ్ వీర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశం ఉంది.