- గ్లోబల్ సమిట్.. ఓ పబ్లిక్ స్టంట్
- ‘తెలంగాణ రైజింగ్ 2047’, హిల్ట్ పాలసీపై చర్చలో బీజేపీ ఎమ్మెల్యే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘తెలంగాణ రైజింగ్ 2047’, హిల్ట్ పాలసీ అంతా ఆకాశానికి నిచ్చెనలు వేయడమేనని, ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు విమర్శించారు. అసెంబ్లీలో తెలంగాణ రైజింగ్ 2047, హిల్ట్ పాలసీ చర్చలో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు, వాస్తవాలకు పొంతనే లేదన్నారు. ‘‘ప్రస్తుతం మన ఎకానమీ 200 బిలియన్ డాలర్లు ఉంటే.. 2047 నాటికి దాన్ని 3 ట్రిలియన్ డాలర్లకు (3 వేల బిలియన్లు) తీసుకెళ్తామని చెప్తున్నరు. అంటే కేవలం 20 ఏండ్లలో 15 రెట్లు వృద్ధి సాధించాలి. ప్రస్తుతం 10 శాతంగా ఉన్న గ్రోత్ రేటు.. ఎక్కడా బ్రేక్ లేకుండా ఏటా 13 శాతానికి పైగా నమోదైతేనే ఇది సాధ్యం.
ప్రాక్టికల్‌గా ప్రపంచంలో ఏ దేశం కూడా ఇలాంటి ఫీట్ సాధించలేదు. ఆకాశానికి నిచ్చెనలు వేస్తే.. జారి కిందపడితే దెబ్బలు గట్టిగా తగులుతాయి. ఈ విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలి’’అని హరీశ్ హెచ్చరించారు. ఇప్పటికే దావోస్‌కు 3 సార్లు వెళ్లారని, గ్లోబల్ సమిట్ అంటూ హడావుడి చేసి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఎంవోయూలు చూపించారన్నారు.
అయితే, ఇదంతా ప్రజలను మాయ చేసే పబ్లిక్ స్టంట్‌లా కనిపిస్తున్నదని విమర్శించారు. గతంలో చేసుకున్న కంపెనీలతోనే మళ్లీ మళ్లీ ఎంవోయూలు చేసుకున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. అలాగే, 13 వేల ఎకరాల ఫార్మాసిటీ భూములు తాము అధికారంలోకి రాగానే రైతులకు తిరిగి పంచుతామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు ప్రగల్భాలు పలికారని, తీరా అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తకుండా ఇంకేదో చేస్తున్నారని పాల్వాయి హరీశ్ విమర్శించారు.
