ముషీరాబాద్, వెలుగు: మత్స్యకార కులానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వనని తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. బీసీ ఏ రిజర్వేషన్లలోకి ఇతర కులాలు రాకుండా అడ్డుగోడలా ఉంటూ కులవృత్తికి రక్షణగా ఉంటానని చెప్పారు. బుధవారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గంగపుత్ర చైతన్య సమితి 7వ వార్షికోత్సవం సందర్భంగా గంగపుత్ర సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లకు ఆత్మీయ సన్మాన సభ జరిగింది.
ఈ కార్యక్రమానికి మెట్టు సాయికుమార్, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవి, బీసీ పొలిటికల్ ఫ్రంట్ అధ్యక్షుడు బాలగౌని బాలరాజు గౌడ్, తెలంగాణ గంగ తెప్పోత్సవం అధ్యక్షుడు మహేందర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ చైతన్యంతో గంగపుత్రులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినందుకు అభినందనలు తెలిపారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకు ఏబీసీడీ వర్గీకరణ అమలు చేసి గంగపుత్రుల దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
