
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ముమ్మాటికీ తప్పేనని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. నీటి పారుదల రంగంపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ అంశంపై చర్చ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఖర్చుచేసి రూపాయికి కూడా అక్కరకు రాని ప్రాజెక్టు నిర్మించిందని విమర్శించారు.
ఆ ప్రాజెక్టు అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి విచారణ అప్పగించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తప్పులు చేసినందువల్లే రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని, ఇప్పుడు సభలో ఒకరినొకరు తిట్టుకుంటూ కాలం వెళ్లదీయొద్దని సూచించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఆదిలాబాద్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు.