బీఆర్ఎస్ అంటున్న కేసీఆర్ కు సీఆర్ఎస్ ఇవ్వాలె: రఘునందన్ రావు

బీఆర్ఎస్ అంటున్న కేసీఆర్ కు సీఆర్ఎస్ ఇవ్వాలె: రఘునందన్ రావు

మెదక్: బీఆర్ఎస్ అంటున్న కేసీఆర్ కు సీఆర్ఎస్ (కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్) ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. జిల్లాలోని నర్సాపూర్ లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2014 ఎన్నికల సమయంలో మదన్ రెడ్డిని గెలిపిస్తే... నర్సాపూర్ ను దత్తత తీసుకుంటామని, అలాగే లక్షా ఎకరాలకు సాగు నీళ్లు అందిస్తామని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్ ను నమ్మి వరుసగా  2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి మదన్ రెడ్డిని గెలిపిస్తే... నర్సాపూర్ లోని ఒక్క ఎకరం భూమికి కూడా నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లు.. కేసీఆర్ ను నమ్మి మదన్ రెడ్డిని గెలిపిస్తే నర్సాపూర్ కు తీరని అన్యాయం జరిగిందని మండిపడ్డారు. నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపల్, ఆర్డీవో, డీఎస్పీ ఆఫీస్ లకు సొంత కార్యాలయాలు లేవని ఫైర్ అయ్యారు.

5 ఏళ్ల కిందట నర్సాపూర్ కు 500 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేశారని... ఇప్పటి వరకు ఒక్క ఇల్లును కూడా పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే ఎమ్మెల్యే మదన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ నైతే రోజుల వ్యవధిలోనే పూర్తి చేశారని తెలిపారు. ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే ఆ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని సవాల్ విసిరారు. నర్సాపూర్, జిన్నారం, పటాన్ చెరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కంపెనీల్లో స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్ చెప్పారన్న రఘునందన్.. ఇప్పటికీ ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు కర్రు కాల్చి వాత పెట్టాలని రఘునందన్ రావు కోరారు.