
హైదరాబాద్, వెలుగు: ఓల్డ్ సిటీ మర్డర్లకు అడ్డాగా మారిందని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తెల్లవారుజామున 2, 3, 4 గంటల వరకు దుకాణాలు, హోటళ్లు తెరిచే ఉంచుతున్నారని, షాపులను బంద్ చేయించేందుకు వెళ్లే పోలీసులను ఎంఐఎం నేతలు బెదిరిస్తున్నారన్నారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పాతబస్తీని ఎంఐఎం నేతలు అడ్డాగా మార్చుకున్నారని, అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంట్ పరిధిలోనే ఎక్కువ మర్డర్లు జరుగుతున్నాయన్నారు.
శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులపై అసదుద్దీన్ ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎంఐఎం ఒత్తిడికి సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారన్నారు. బాలాపూర్, శాలిబండ, బేగంపేట, మల్లేపల్లి, అసిఫ్ నగర్, కాలాఫత్తర్, కాచిగూడ, మేడ్చల్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా దోపిడీలు జరుగుతున్నాయని, ఇటీవల మేడ్చల్లో మెయిర్ రోడ్డు మీదే గోల్డ్ షాపులో దోపిడీ జరిగిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎవరికీ భయపడొద్దని, పాతబస్తీలో శాంతిభద్రతలను కాపాడాలన్నారు.