మజ్లిస్ కు టీఆర్ఎస్ నిధులు సమకూరుస్తోంది

మజ్లిస్ కు టీఆర్ఎస్ నిధులు సమకూరుస్తోంది
  • బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపణ
  • నిధులివ్వలేదని రాష్ట్రంలో ఏడుస్తరు.. కేంద్రంలో వినతులిస్తరని సెటైర్

నాగర్​కర్నూల్, వెలుగు: సీఏఏ వ్యతిరేక ముసుగులో ఎంఐఎం (మజ్లిస్)కు టీఆర్ఎస్ నిధులు సమకూరుస్తోందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. మన దేశం నుంచి ఈశాన్య రాష్ట్రాలను విడగొడతామని ప్రకటించిన వేర్పాటువాదులకు ఇస్లామిక్ దేశాలు నిధులు సమకూరుస్తుంటే… మజ్లిస్ కు సీఎం కేసీఆర్ నిధులిచ్చి పెంచి పోషిస్తున్నారని అన్నారు. పార్లమెంట్ ఆమోదించిన సీఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో తీర్మానం చేయడం సిగ్గుచేటన్నారు. కేవలం ముస్లిం ఓటు బ్యాంకు కోసమే టీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు సీఏఏను వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. శుక్రవారం నాగర్‌‌‌‌కర్నూల్‌‌ జిల్లాలోని కల్వకుర్తికి వచ్చిన ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అరాచకమే తప్ప.. ఎలాంటి అభివృద్ధి జరగడం లేదన్నారు. టీఆర్ఎస్ నేతలు కేంద్రం ఏమివ్వడం లేదని రాష్ట్రంలో ఏడుస్తరని, మళ్లీ ఢిల్లీకి పోయి కేంద్రమంత్రులకు వినతిపత్రాలు ఇస్తారని ఎద్దేవా చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా? అని రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తాను భయంకరమైన హిందువునని చెప్పుకునే సీఎం కేసీఆర్.. భైంసా తగలబడితే ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు. తండ్రి యజ్ఞాలు చేస్తుంటే, కొడుకు దేవుడే లేడంటడని.. కేసీఆర్, కేటీఆర్ ను ఉద్దేశించి విమర్శించారు. ముందు తన కొడుకుకు సంస్కారం నేర్పించాలని కేసీఆర్ కు సూచించారు. స్థానిక లైబ్రరీ ముందున్న వైన్ షాప్​ను తొలగించాలని ధర్నా చేసినా పట్టించుకోవడం లేదని, దాని తొలగించేలా చర్యలు తీసుకోవాలని కల్వకుర్తి యూత్​సభ్యులు ఎంపీకి వినతి పత్రం ఇచ్చారు.

దేశ భద్రత కోసమే ఎన్నార్సీ…

దేశ భద్రత కోసమే కేంద్ర ప్రభుత్వం ఎన్నార్సీ తీసుకొస్తోందని ఎంపీ సంజయ్ తెలిపారు. దీనిపై కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం ఆమనగల్లు పట్ణణంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. హిందువులంతా ఒక్కటై సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఆమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ధికి తనవంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆమనగల్లులోని 30 బెడ్స్‌‌  ఆస్పత్రిని 50 బెడ్స్ గా మార్చేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని నేషనల్ ఓబీసీ కమిషన్ మెంబర్ టి.ఆచారి తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాంపాల్​ నాయక్,  వైస్​చైర్మన్​ దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.