
Arisinfra Solutions IPO: దేశీయ స్టాక్ మార్కెట్లు అనుకూలంగా ఉండటంతో చాలా కాలం తర్వాత తిరిగి వరుస ఐపీవోలతో రద్దీ కొనసాగుతోంది. కొన్ని ఐపీవోలు ఇన్వెస్టర్లకు తొలిరోజే భారీ లాభాలతో స్వాగతం పలుకుతుండగా.. మరికొన్ని మాత్రం నిరాశను మిగులుస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లా్డుకోబోతున్నది అరిసిన్‌ఫ్రా సొల్యూషన్స్ కంపెనీ ఐపీవో గురించే. మెయిన్ బోర్డ్ కేటగిరీలో వచ్చిన ఐపీవో తొలిరోజే నష్టాల లిస్టింగ్ తో పెట్టుబడిదారులను నిరాశకు గురిచేసింది. కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో ఒక్కోటి ఇష్యూ రేటు కంటే 8 శాతం తక్కువగా రూ.205 వద్ద జాబితా అయ్యాయి. ఇదే క్రమంలో కంపెనీ షేర్లు బీఎస్ఈలో ఒక్కోటి 6 శాతం పతనంతో రూ.209 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. లిస్టింగ్ ముందు కంపెనీ షేర్లు గ్రేమార్కెట్లో సున్నా ప్రీమియంతో ఫ్లాట్ ట్రేడింగ్ కొనసాగించాయి.
కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.499.60 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కంపెనీ 2కోట్ల 25 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేసింది. కంపెనీ ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ కోసం జూన్ 18 నుంచి జూన్ 20 వరకు అందుబాటులో ఉంచబడింది. ఐపీవో కోసం కంపెనీ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.210 నుంచి రూ.222గా నిర్ణయించింది. అలాగే లాట్ పరిమాణాన్ని 67 షేర్లుగా ఫిక్స్ చేయటంతో ఇన్వెస్టర్లు కనీసం రూ.14వేల 874 పెట్టుబడిగా పెట్టా్ల్సి వచ్చింది.
కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.224 కోట్ల 82 లక్షలు సమీకరించింది. పబ్లిక్ బిడ్డింగ్ జరిగిన మూడు రోజుల్లోనే కంపెనీ తొలి పబ్లిక్ ఇష్యూ 2.65 సార్లు సబ్‌స్క్రైబ్ అయింది. బ్రోకరేజీలు ఐపీవోపై సూచనలను పరిశీలిస్తే.. ఆనంద్ రాఠీ ఐపీవో ఖరీదైనదిగా ఉందని ఇన్వెస్టర్లు దీనికి దూరంగా ఉండాలని సూచించింది. అలాగే బజాజ్ బ్రోకింగ్ పెట్టుబడిదారులకు లాంట్ టర్మ్ వ్యూ కోసం ఐపీవోలో ఇన్వెస్ట్ చేయెుచ్చని పేర్కొంది.
కంపెనీ వ్యాపారం..
2021లో స్థాపించబడిన కంపెనీ నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగంలో పనిచేస్తున్న కంపెనీలకు మెటీరియల్‌లను సులభంగా కొనుగోళ్లతో పాటు ఆర్థిక వ్యవహారాలను మెరుగ్గా నిర్వహించడానికి సహాయం చేస్తుంది. అరిస్ఇన్ఫ్రా అనేది విస్తరిస్తున్న నిర్మాణ సామగ్రి మార్కెట్లో బిజినెస్-టు-బిజినెస్ (B2B) టెక్నాలజీ ఆధారిత సంస్థ. కంపెనీ స్టీల్ పైపులు, ఎమ్ఎస్ వైర్లు, టీఎంటీ బార్లు, సిమెంట్ సహా మరిన్ని ఉత్పత్తులను అందిస్తోంది. అలాగే రెడీ-మిక్స్ కాంక్రీట్, నిర్మాణ రసాయనాలు, వాల్లింగ్ సొల్యూషన్ ఉత్పత్తులను కూడా పంపిణీ చేస్తోంది.