కేంద్ర నిధులపై కేటీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే

కేంద్ర నిధులపై కేటీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే

 

  •     తెలంగాణకు కేంద్రం 3.94 లక్షల కోట్లు ఖర్చు చేసింది
  •     ఇది తప్పని నిరూపిస్తే    దేనికైనా రెడీ అని సవాల్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై మంత్రి కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెపుతున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. ఏడున్నరేండ్ల నుంచి కేంద్రానికి రూ.3 లక్షల 65 వేల కోట్ల పన్నులు కట్టామని కేటీఆర్ అంటున్నారని, ఈ సమయంలో తెలంగాణ కోసం కేంద్రం రూ.3 లక్షల 94 వేల కోట్లు ఖర్చు చేసిందని, ఇది తప్పని కేటీఆర్ నిరూపిస్తే దేనికైనా రెడీ అని సవాల్ విసిరారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీని విమర్శించే స్థాయి కేటీఆర్ దా? అని ఫైర్ అయ్యారు. బండి సంజయ్ తంబాకు తింటాడని ఆరోపిస్తున్న కేటీఆర్ ముందు డ్రగ్స్​ టెస్టుకు రావాలని, ఆయన వస్తానంటే, సంజయ్ ను ఏ టెస్టుకైనా తీసుకొచ్చేందుకు తాను సిద్ధమని అన్నారు. సీఎం కేసీఆర్ సంస్కారం నేర్పితే కేటీఆర్ లా ఉంటుందని ఎద్దేవా చేశారు.

జన్వాడలోని ఫాంహౌస్​ను కూల్చేయాలి

జీవో 111కు తూట్లు పొడిచి జన్వాడలో కట్టిన ఫాంహౌస్ ను కూల్చేయాలని అర్వింద్​ డిమాండ్ చేశారు. తెలంగాణలో బియ్యం బ్లాక్ మార్కెట్​పై సీబీఐ విచారణ జరిపేలా ఎన్​వోసీ ఇచ్చే దమ్ము కేటీఆర్​కు ఉందా? అని నిలదీశారు. రాష్ట్రంలో 900 రైస్ మిల్లుల్లోని 400 మిల్లుల్లో రైస్ బ్యాగులే లెక్క పెట్టలేదని ఆరోపించారు. సంజయ్ పాలమూరులో తిరుగుతున్నాడని ఎద్దేవా చేస్తున్న కేటీఆర్​కు హన్మకొండలో ఏం పని అని ప్రశ్నించారు. కేటీఆర్.. తుపాకీ రాముడు, ఉత్తర కుమారుడు, బుడ్డర్ ఖాన్ మాదిరిగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడని విమర్శించారు. తనపై పోటీకి కేటీఆర్ తన చెల్లి కవితను నిలబెడితే మళ్లీ ఓడగొడుతానన్నారు.