
- మోసమే కేసీఆర్ నైజం.. ఉద్యమంలో కేసీఆర్‌ది భయంకరమైన స్వార్థం
- ఆయన వెంట నడిచిన వారి గొంతు కోశారు
- బీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం..
- రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ధీమా
న్యూఢిల్లీ, వెలుగు: కేసీఆర్‌ను మించిన నయవంచక రాజకీయ నేత ప్రపంచంలోనే ఎవరూ లేరని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర భయంకరమైన స్వార్థంతో కూడినదని ఆరోపించారు. ఉద్యమంలో సమయంలో ‘మీరే అంతా’ అన్న కేసీఆర్ ఇప్పుడు ‘మీరెంత?’ అంటున్నారని తెలిపారు. నమ్మి వెంట నడిచిన వారి గొంతు కోశాడని విమర్శించారు. ఉద్యమ సమయంలో భుజంభుజం కలిపి నడిచిన గొప్పవాళ్లు ఎవరూ ఇప్పుడు ఆయన వెంట లేరన్నారు. ఢిల్లీలోని తన నివాసంలో లక్ష్మణ్ ‘వెలుగు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓల్డ్ సిటీని అభివృద్ధి చేయకుండా, ఉగ్రవాదుల అడ్డాగా మార్చుతున్న ఎంఐఎంతో అంటకాగుతున్నారని తెలిపారు. కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యులు అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనే అని.. రాష్ట్రంలో అధికారంలో వచ్చేది తామేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో లేదు.. గల్లీలో లేదని అన్నారు.
అందర్నీ వాడుకొని.. వంచించారు
‘‘తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర భయంకర స్వార్థంతో కూడినది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో పనిచేసిన వాళ్లెవరూ ఇప్పుడు ఆయన వెంట లేరు. లక్ష్మణ్ బాపూజీ, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ లాంటి వ్యక్తుల్ని సైతం అవమానించారు. బెల్లయ్య నాయక్, గాదే ఇన్నయ్య, మేచినేని కిషన్ రావు, నరేంద్ర, విజయశాంతి లాంటివాళ్లను మోసం చేశారు. కేసీఆర్‌ను నమ్మి ఎందరో ఉద్యమకారులు తమ ఆస్తులు అమ్ముకున్నరు. కొందరు ప్రాణాలు పోగొట్టుకున్నరు. ప్రపంచంలో ఇంతలా నమ్మించి గొంతు కోసిన నాయకుడు, నయవంచన చేసిన రాజకీయ నాయకుడు ఇంక్కెవరూ లేరు” అని అన్నారు.
అవినీతి, అక్రమాలతో విపరీతమైన దోపిడీ
రాష్ట్రంలో కేసీఆర్ ధ్వంసం చేయని వ్యవస్థ లేదని లక్ష్మణ్ అన్నారు. అధికారంతో ఆయన చేస్తున్న అణచివేతను దృష్టిలో పెట్టుకొని నిజమైన పోరాటం మొదలుపెట్టింది బీజేపీయే అన్నారు. బెదిరింపులతో టీవీ చానల్స్, పత్రికలను లొంగదీసుకున్నారని విమర్శించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములను తన అనుచరులతో కబ్జా చేసుకున్నడని మండిపడ్డారు. ‘‘రిటైర్డ్ అధికారులను పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నరు. ఓల్డ్ సిటీని అభివృద్ధి చేయకుండా ఉగ్రవాదులకు అడ్డాగా మార్చిన ఎంఐఎం పార్టీని నెత్తిన పెట్టుకొని పాలన సాగిస్తున్నరు. మిషన్ భగీరథ మొదలుకొని కాళేశ్వరం ప్రాజెక్టు వరకు అన్ని కుంభకోణాలే. అక్రమాలు, అవినీతితో కొల్లగొట్టిన డబ్బులతో దేశంలో రాజకీయం చేస్తానని బయల్దేరారు. ఇలాంటి కేసీఆర్‌ను గడీల నుంచి బజారులోకి లాగింది బీజేపీనే. మేం ఫీల్డ్‌లోకి వచ్చాకే ప్రజలకు ధైర్యం వచ్చి నిలదీస్తున్నరు” అని అన్నారు.
తప్పు చేస్తే శిక్ష తప్పదు
కేసీఆర్ లాగా హోంగార్డు నుంచి డీజీపీ వరకు అందర్నీ రాజకీయాలకు వాడుకునే అలవాటు బీజేపీకి లేదని లక్ష్మణ్ అన్నారు. తప్పు చేసిన వాళ్లకు న్యాయస్థానాల్లో తప్పనిసరిగా శిక్ష పడుతుందన్నారు. ఇందిరాగాంధీ, జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి వాళ్లను కోర్టులు వదిలిపెట్టలేదని.. రేపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరిస్థితి కూడా అదే అన్నారు. కవిత చుట్టూ తెలంగాణ రాజకీయం తిప్పడం బీఆర్ఎస్, వాళ్ల అనుకూల మీడియా కుట్ర అని చెప్పారు.
కేసీఆర్‌ను గద్దెదించుతం
ప్రజాస్వామ్యయుతంగా ప్రజలను చైతన్యవంతం చేసి కేసీఆర్‌ను గద్దె దింపుతామని లక్ష్మణ్ చెప్పారు. తెలంగాణ సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలపై కేసీఆర్ కుటుంబం చేసిన దురాక్రమణ నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిస్తామన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్న సమయంలో జరిగిన మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని ఓట్లు సంపాదించిందో ప్రజలు ఇంకా మర్చిపోలేదు” అని అన్నారు.
ఉద్యమంలో బీజేపీది ప్రధాన పాత్ర
తెలంగాణపై మాట్లాడే హక్కు నూటికి నూరు శాతం బీజేపీకి ఉందని లక్ష్మణ్ అన్నారు. 1993లో ఒక ఓటు రెండు రాష్ట్రాలనే తీర్మానం మొదలు.. గోదావరి-- కృష్ణ జలసాధన తదితర ఎన్నో పోరాటాలు చేపట్టామని తెలిపారు. విద్యాసాగర్ రావు, దత్తాత్రేయ, ఆలె నరేంద్ర, మాకినేని కిషన్ రావు, మందాడి సత్యనారాయణ రెడ్డి, జంగారెడ్డి రాజేశ్వరరావు వంటి ఎందరో నాయకులు తెలంగాణ కోసం పనిచేశారని పేర్కొన్నారు. ‘‘పార్లమెంట్ లోపల, బయట దివంగత నేత సుష్మా స్వరాజ్ తెలంగాణకు అనుకూలంగా గొంతెత్తారు. కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ స్వార్థ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేలా ప్రత్యేక రాష్ట్ర బిల్లుకు బీజేపీ సంపూర్ణ సహకారం అందించింది”అని అన్నారు.
అబద్ధాల ప్రచారంలో దిట్ట
కేసీఆర్ కుటుంబం గోబెల్స్ ప్రచారం చేయడంలో దిట్ట అని లక్ష్మణ్అన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబం తెలంగాణ యాస, భాషతో ప్రజల్ని మోసం చేస్తున్నారు. దుబ్బాక ఎన్నికల నుంచి మునుగోడు ఎన్నికల ప్రచారం వరకు మోటార్లకు కేంద్రం మీటర్లు పెడుతుందని ప్రచారం చేశారు. తెలంగాణలోని ఒక్క మోటార్ కైనా కేంద్ర ప్రభుత్వం మీటర్ పెట్టిందా?.. వీళ్లు ఎంత బాగా అబద్ధాలు ప్రచారం చేయగలరు అనే దానికి ఈ ఒక్క ఉదాహరణ చాలన్నారు.