
హైదరాబాద్, వెలుగు: చీకటి ఒప్పందం కారణంగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎంఐఎం పార్టీ పోటీ చేయట్లేదని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. అయితే, ఆ పార్టీ మద్దతిచ్చేది బీఆర్ఎస్ కా.. కాంగ్రెస్ పార్టీకా అనే విషయాన్ని ప్రజలకు చెప్పాలని డిమాండ్‌చేశారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. బిహార్‌లో 30 సీట్లలో పోటీ చేయబోతున్న ఎంఐఎం పార్టీ.. హైదరాబాద్ లోజరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎందుకు పోటీ చేయట్లేదో ప్రజలు తెలుసుకోవాలన్నారు.
డిసెంబర్లో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి మేయర్ పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అంగీకరించడమే ఈ ఒప్పందం వెనుక ఉన్న అసలు కారణమని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం సూచించిన వ్యక్తినే కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టబోతున్నారనేది నగ్న సత్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్–ఎంఐఎం.. భయంతో, రాజకీయ లాభంతో ఒకటయ్యాయని అన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తే.. ఆ ఓటు ఎంఐఎం అభ్యర్థికే పడుతుందన్నారు. కాబట్టి, బీజేపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.