
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కానుంది. రాబోయే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జూలై 2, 3 తేదీలలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశంలో ప్రధాని మోడీ,హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా కేంద్రమంత్రులు, పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
హైదరాబాద్ లో సమావేశాలు నిర్వహించడం వెనుక బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడే ఉంది. ఇటీవల జరిగిన కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ కుటుంబపాలనపై మోడీ విరుచుకపడ్డారు. ఈ సారి తెలంగాణలో అధికారంలోకి వస్తామని దీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ సమావేశాలు కూడా ఇక్కడ నిర్వహిస్తుండడంతో తెలంగాణకు తాము ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో చెప్పకనే చెప్పింది.
కాగా రెండు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించనున్నారు.
మూడునెలలకు ఓసారి జరిగే ఈ సమావేశాలు కోవిడ్ కారణంగా ఆలస్యం అయింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు చివరిసారిగా నవంబర్, 2021లో జరిగాయి. ఐదురాష్ట్రాల ఎన్నికల ముందు ఈ సమావేశాలు జరగగా ఆ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయాన్ని సాధించింది. అటు కేసీఆర్ కూడా కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. కేంద్రం విధానాలను ఎండగడుతూనే దేశంలోని విపక్ష నాయకులతో భేటీ అవుతన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.