
ప్రజల కోసం గద్దర్ అనేక ఉద్యమాలు చేశారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ముందుండి పోరాడారని అన్నారు. గద్దర్ తన జీవితమంతా ప్రజల కోసం, ప్రజా ఉద్యమాల కోసమే పని చేశారన్నారు. ‘‘మా నాన్న వెంకటస్వామి, గద్దర్ కలిసి అనేక పోరాటాలు చేశారు. ఇదే విషయాన్ని గద్దర్ నాతో చెప్పేవారు. ‘మీ నాన్నతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉండేది’ అని చెప్పేవారు” అని వివేక్ తెలిపారు. గద్దర్ మరణం తీరని లోటు అని అన్నారు. హైదరాబాద్‌లో గద్దర్ విగ్రహం పెట్టాలని, ఆయన పాటలతో అల్బమ్ రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో సినిమా తీసిన సమయంలో.. అద్భుతమైన పాట పాడి ప్రజల్లో కదలిక తీసుకొచ్చారని అన్నారు. తెలంగాణ వస్తే బాగుంటుందని, పార్టీ పెట్టి అందరికి ఒకతాటిపైకి తీసుకొద్దామని అనుకున్నారని చెప్పారు.