కాంగ్రెస్ లిస్ట్ ఇంకా ప్రగతి భవన్‌లోనే : బండి సంజయ్

కాంగ్రెస్ లిస్ట్ ఇంకా ప్రగతి భవన్‌లోనే : బండి సంజయ్
  • కాంగ్రెస్ లిస్ట్ ఇంకా ప్రగతి భవన్‌లోనే..
  • పాపం రేవంత్‌కు ఈ విషయం తెల్వదు: బండి సంజయ్
  • లిస్ట్ మీద కేసీఆర్ స్టాంప్ పడలేదు
  • ఆయన ఓకే అన్నాక ఢిల్లీకి పోతది
  • సీఎం సీటు కోసం హరీశ్​, కేటీఆర్​ కొట్లాడుతున్నరు
  • బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్


హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల లిస్టు ఇంకా ప్రగతి భవన్‌లోనే ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లిస్ట్ మీద ఇంకా కేసీఆర్ స్టాంప్ పడలేదని, ఆయన ఓకే అన్నాక ఢిల్లీకి పోతుందని విమర్శించారు. పాపం రేవంత్ రెడ్డికి ఇది తెలియదని అన్నారు. కేసీఆర్ ఆటలో రేవంత్, హరీశ్‌ రావు బలి పశువులు కాబోతున్నారని అన్నారు. అత్యంత దీనావస్థలో బీఆర్ఎస్ ఉందని, అడ్డా కూలీలకు పైసలిచ్చి కండువా కప్పి షో చేస్తూ ప్రచారం చేసుకునే పరిస్థితిలో బీఆర్ఎస్ ఉందని చెప్పారు. ఎంఐఎం, కాంగ్రెస్‌తో కలిపి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని, బీజేపీ గ్రాఫ్‌ను తగ్గించేందుకు ఆ మూడు పార్టీలు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. 

గురువారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, పరిగికి చెందిన ఈశ్వరప్ప, మాజీ జడ్పీటీసీ జోగిరెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు దిలీప్, సతీశ్​, నవీన్, వికాస్ తోపాటు పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు బీజేపీలో చేరారు. ఈ ఇద్దరికీ పార్టీ కండువా కప్పి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘‘సీఎం సీటు కోసం బావాబామ్మర్దులు కేసీఆర్ ఎదుట గొడవ పడుతున్నారు. ఈ గొడవ తాళలేక కేసీఆర్ ఇబ్బంది పడుతున్నారు. అందుకే హరీశ్‌ను, కేటీఆర్‌‌ను వేర్వేరుగా పిలిచి ‘నీకే సీఎం పదవి’ ఇస్తానంటూ ఊరిస్తున్నారు. ‘తెలంగాణ ఉద్యమకారుడిని నేను. నాకు సీఎం ఇవ్వకుండా అమెరికా నుంచి వచ్చిన కేటీఆర్​కు ఎందుకు సీఎం పదవి ఇస్తారు?’ అని హరీశ్‌ గొడవ చేస్తున్నడట. పైకి మాత్రం బావా..  బావా అంటూ డ్రామాలాడుతున్నారు” అని విమర్శించారు. 

రేవంత్ రెడ్డికి వేరే మార్గాల ద్వారా రాయబారాలు పంపుతున్నారని సంజయ్ ఆరోపించారు. ‘‘ప్రధాని మోదీ సభకు వచ్చిన ప్రజలను చూసిన తర్వాత బీఆర్ఎస్ వైపు ఎవరూ చూడటం లేదు. చివరకు అడ్డా కూలీలను తీసుకొచ్చి పైసలిచ్చి బీఆర్ఎస్ కండువా కప్పి షో చేస్తూ ప్రచారం చేసుకుంటున్న దీనస్థితికి ఆ పార్టీ చేరింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటే. పైకి మాత్రం ‘నువ్వు కొట్టినట్లు చెయ్. నేను ఏడ్చినట్లు చేస్తా’నని ఒప్పందం చేసుకుని డ్రామాలాడుతున్నాయి” అని మండిపడ్డారు. బీజేపీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఓట్లు చీల్చకుండా వార్ వన్ సైడ్ చేయాలని కంకణం కట్టుకున్నారని చెప్పారు.

రాజకీయాలు వేగంగా మారుతున్నయ్: కిషన్ రెడ్డి

రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయని కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్‌ను ఓడించాలని ప్రజలు కంకణం కట్టుకున్నారని, బీజేపీని గెలిపించాలని డిసైడ్ అయ్యారని అన్నారు. కాంగ్రెస్‌, ఎంఐఎంకు ఓటేస్తే బీఆర్ఎస్​కు ఓటేసినట్లేనని, కాంగ్రెస్​లో ఎమ్మెల్యేలు గెలిచినా బీఆర్ఎస్​లో చేరుతారని ఆరోపించారు. గత 2 ఎన్నికల్లో ఇదే జరిగిందని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మూడు ఒక్కటేనన్నారు.

బీసీల ఓట్లు అడిగే హక్కు వారికి లేదు: ఎంపీ లక్ష్మణ్

బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, కేసీఆర్, కేటీఆర్‌‌కు లేదని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కుల గణన పేరుతో కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తున్నదని ఆరోపించారు. పరిగికి చెందిన ఈశ్వరప్ప బీజేపీలో చేరటం మంచి పరిణామమని, రాష్ర్టవ్యాప్తంగా ఆయన అనేక కార్యక్రమాలు చేశారని కొనియాడారు. బీసీల అభ్యున్నతి కోసం ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని, రూ.20 వేల కోట్లతో మత్స్య శాఖను ఏర్పాటు చేశారని చెప్పారు. రాజకీయంగా బీసీల అభ్యున్నతికి బీజేపీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని గుర్తు చేశారు.