కేసీఆర్​ జూటా కోర్..బడా చోర్ : బండి సంజయ్​

కేసీఆర్​ జూటా కోర్..బడా చోర్  : బండి సంజయ్​
  • కాంగ్రెస్సోళ్లంతా అమ్ముడు పోయేటోళ్లే 

పిట్లం, వెలుగు: ‘కేసీఆర్​నోరు తెరిస్తే అబద్ధాలు, కేంద్రం ఏం ఇవ్వలేదంటారు.. సీఎం కేసీఆర్​జూటా కోర్​బడా చోర్’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి, కరీంనగర్​ఎంపీ బండి సంజయ్ కేసీఆర్​పై​విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కామారెడ్డి జిల్లా జుక్కల్​నియోజకవర్గంలోని బిచ్కుందలో నిర్వహించిన రోడ్​షోలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి నవోదయ స్కూళ్లు, మెడికల్​కాలేజీలు ఒక్కటి కూడా ఇవ్వలేదంటున్న కేసీఆర్, ​అవి ప్రగతి భవన్, ఫాం హౌజ్​ల నుంచి తెచ్చిండా అని ప్రశ్నించారు. ఫాంహౌజ్​ నుంచి బయటకు వచ్చి చూస్తే కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందో తెలుస్తుందన్నారు. 

గతంలో తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల్లో తొమ్మిది నవోదయ, కేంద్రీయ స్కూళ్లుంటే ప్రస్తుతం వాటి సంఖ్య 35కు చేరిందన్నారు. ఈ స్కూళ్లు ఇచ్చిందెవరని సంజయ్​ప్రశ్నించారు. ప్రధాని మోదీ పసుపు బోర్డు ప్రకటన, ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేస్తామని చెప్పడంతో కేసీఆర్​కు భయం పట్టుకుందన్నారు. కేంద్రం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టకపోతే రూ.25 వేల కోట్లు ఆపిందని జూటా మాటలు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. కేసీఆర్​అబద్ధాలు నమ్మి మోసపోడానికి రైతులు సిద్ధంగా లేరన్నారు. విద్యుత్​కొనుగోళ్ల పేరిట దోపిడీ చేసిన కేసీఆర్, కేంద్రం మోటర్లకు మీటర్లు బిగించమని చెప్పిదంటూ నాటకం ఆడుతున్నారన్నారు. 

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఉన్నదంతా ఊడ్చేశారని, ఇప్పటికే రూ. ఐదున్నర లక్షల కోట్ల అప్పులు తెచ్చినట్లు చెప్పారు. అప్పులు ఎక్కువైతే ప్రమాదమని తెలిసి కేంద్రం అడ్డుకుంటే కేసీఆర్​కండ్లు మండాయన్నారు. అప్పులకు కల్లెం వేయకుంటే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టెటోడని విమర్శించారు. కేసీఆర్​కు ఓటమి భయం పట్టుకుందని, జనం పట్టించుకోవడం లేదన్నారు. దిక్కుతోచని పరిస్థితిలో ఓవైసీ కాళ్లు పట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. 

‘ఓవైసీ కేసీఆర్​కు మామ అయితడా. మామను గెలిపించాలని చెబుతున్నడు. అసలేందీ వరుస. పొరపాటున బీఆర్ఎస్​ను గెలిపిస్తే కేసీఆర్​రాష్ట్రాన్ని ఎంఐఎంకు తాకట్టు పెడతాడు. అదే జరిగితే బొట్టు పెట్టుకుని, కంకణం కట్టుకుని తిరిగే పరిస్థితి ఉండదు’ అని అన్నారు. ‘మీడియా, టీవీల్లో వార్తలు చూసి మోసపోకండి. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీలో బీజేపీ లేదన్నారు. చివరికి ఏమైందో అందరికీ తెలిసిందే. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం. రామరాజ్యం స్థాపిస్తాం’ అని సంజయ్​ధీమా వ్యక్తం చేశారు. ‘కాంగ్రెసోళ్లు ఆరు గ్యారంటీల గురించి మట్లాడుతుంటే నవ్వొస్తుంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు అమ్ముడుపోరని గ్యారంటీ ఇవ్వగలరా? ఎందుకంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా కేసీఆర్​కు అమ్ముడు పోయినోళ్లే. 

ఈ సారి కూడా పోరని గ్యారంటీ ఏమిటి’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్​లో అందరూ సీఎంలే అని, పదవి కోసం ఒకరితో ఒకరు కొట్టుకుంటూ ప్రభుత్వాన్ని కూల్చేస్తారని, బీఆర్ఎస్​లో కేసీఆర్ సీఎం అయితే హరీశ్, కవిత, సంతోష్​రావులు ప్రభుత్వాన్ని కూల్చివేస్తారన్నారు.  

వేదికపైకి రాకుండానే వెళ్లి పోయిన బండి​

బీజేపీ జాతీయ అధ్యక్షుడు బండి సంజయ్​ కోసం ఏర్పాటు చేసిన వేదికపైకి రాకుండానే రోడ్​షో లో పాల్గొని వెళ్లిపోవడంతో కార్యకర్తలు నారాజ్​అయ్యారు. హెలిప్యాడ్​ నుంచి ర్యాలీగా వేదిక వద్దకు వస్తున్న సంజయ్​ను బస్టాండ్​సమీపంలో కార్యకర్తలు మాట్లాడాలని కోరడంతో అక్కడే మాట్లాడారు. 

అప్పటికే సమయం మించిపోవడంతో వెళ్లిపోయారు. దీంతో వేదిక వద్ద వేచి చూస్తున్న కార్యకర్తలు నిరాశకు లోనయ్యారు. మీటింగ్​ ఉందని చెప్పడంతో అక్కడే ఉన్న ప్రింట్, ఎలక్ట్రానిక్​ మీడియా సభ్యులు వేదిక వద్దే ఉన్నారు. రోడ్​షోలో మాట్లాడుతున్న విషయం తెలియకపోవడంతో ఎవరూ అక్కడికి వెళ్లలేదు. రోడ్ షో తర్వాత సంజయ్​వెళ్లి పోవడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరికి బీజేపీ అభ్యర్థి అరుణతార నచ్చజెప్పారు. తర్వాత అరుణతార ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.