గవర్నర్తో డీకే అరుణ భేటీ..ఎమ్మెల్యేగా గుర్తించేలా చొరవ తీసుకోండి : డీకే అరుణ

గవర్నర్తో డీకే అరుణ  భేటీ..ఎమ్మెల్యేగా గుర్తించేలా చొరవ తీసుకోండి : డీకే అరుణ

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ శుక్రవారం (సెప్టెంబర్ 8న) రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసైతో భేటీ అయ్యారు. ఆగస్టు 24వ తేదీన తెలంగాణ హైకోర్టు తనను ఎమ్మెల్యేగా గుర్తించి.. తీర్పు ఇచ్చిందని గవర్నర్ కు వివరించారు డీకే అరుణ. సెప్టెంబర్ 2వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం కూడా గెజిట్ విడుదల చేసిందన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శిని కలిసేందుకు రెండు సార్లు వెళ్తే.. వాళ్లు అందుబాటులో లేరన్నారు. ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. అసెంబ్లీ స్పీకర్ నుంచి రెస్పాన్స్ లేకపోవడంతోనే తాను గవర్నర్ ను కలవాల్సి వచ్చిందన్నారు డీకే అరుణ.

హైకోర్టు తీర్పు కాపీని, కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన గెజిట్ ను గవర్నర్ కు అందించామని డీకే అరుణ తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే స్పీకర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో గవర్నర్ తమిళి సై సానుకూలంగా స్పందించారని చెప్పారు. తాను అసెంబ్లీ స్పీకర్ తో మాట్లాడుతానని తనకు చెప్పారని వివరించారు. స్పీకర్ సమాధానం కోసం తాను ఎదురు చూస్తున్నానని చెప్పారు.