ముంపు ప్రాంతాలను పరిశీలించిన డీకే అరుణ

ముంపు ప్రాంతాలను పరిశీలించిన డీకే అరుణ
  • బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
  • మంచిర్యాల, పెద్దపల్లిలో ముంపు ప్రాంతాల పరిశీలన

మంచిర్యాల, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్​ వాటర్​తోనే మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాలు, వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగి తీవ్ర నష్టం జరిగిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావుతో కలిసి మంచిర్యాల ఎన్టీఆర్​ నగర్, రాంనగర్, ఎల్ఐసీ కాలనీ, వేంపల్లి, జైపూర్​మండలం వేలాల ముంపు ప్రాంతాలను సందర్శించారు. వరద బాధితులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సీఎం కేసీఆర్​ కుటుంబం, ఆంధ్రా కాంట్రాక్టర్లు మాత్రమే బాగుపడ్డారని, రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు.

పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలన్నారు. సీఎం కేసీఆర్​ భద్రాచలం నుంచి ఫామ్​హౌస్​కు వెళ్లి పడుకున్నాడని, వరదలతో అతలాకుతలమైన మంచిర్యాల జిల్లాను పట్టించుకోలేదని విమర్శించారు. జిల్లా కేంద్రంలోని పలు కాలనీలతో పాటు అనేక గ్రామాలు, వేల ఎకరాల్లో పంటలు నీటమునిగి ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ముంపు బాధితుల పరిస్థితి దీనంగా ఉందన్నారు. ఇండ్లు కూలిపోయి తలదాచుకునేందుకు చోటు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. కరెంట్ సప్లై లేక చీకట్లో మగ్గుతున్నారని, తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. అప్పు చేసి కట్టుకున్న ఇల్లు మునిగిపోవడంతో మంచిర్యాల బాలాజీనగర్​లో సిద్ది జమున అనే మహిళ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్​ వెంటనే మంచిర్యాల జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూడాలన్నారు. వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం అందించాలని, ఎన్టీఆర్​ నగర్​లోని 700 కుటుంబాలకు సురక్షిత ప్రాంతంలో పునరావాసం కల్పించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ముల్కల్ల మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్​, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

క్లౌడ్​ బరస్ట్​ కాదు.. కేసీఆర్​ బరస్ట్​
పెద్దపల్లి: సీఎం కేసీఆర్ ​క్లౌడ్​బరస్ట్​ అంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడని, కాళేశ్వరం పరిధిలో వచ్చిన వరదలు కేవలం కేసీఆర్​ బరస్ట్ మాత్రమే అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలలో శుక్రవారం ఆమె పర్యటించారు. బాధితులను కలిసి భరోసా కల్పించారు. అనంతరం మాట్లాడుతూ కేసీఆర్​ చేసిన తప్పుల వల్ల పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, మంథని మునిగిపోయాయన్నారు. ఆ తప్పులను కప్పి పుచ్చుకోవడానికే క్లౌడ్​ బరస్ట్ అనే మాయను ప్రజల ముందు పెట్టరన్నారన్నారు.

కేసీఆర్​తన లాభం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాడని, దానివల్లే ఈ విపత్తు వచ్చిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ మంథని నియోజకవర్గ నాయకులు చందుపట్ల సునీల్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి, నాయకులు ఎడ్ల సదాశివ్​, వేల్పుల రాజు, శ్రీనివాస్​, క్రాంతి, సంతు, సూర్య తదితరులు పాల్గొన్నారు.