మా పార్టీ ఓ ఫ్యామిలీ చుట్టూ తిరగదు

మా పార్టీ ఓ ఫ్యామిలీ చుట్టూ తిరగదు
  • బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోడీ

న్యూఢిల్లీ: పార్టీకి, ప్రజలకు మధ్య నమ్మకం పెంచే వారధిగా మారాలని, ఐదు రాష్ట్రాల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచేలా  కృషి చేయాలని పార్టీ నాయకులకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ‘సేవ, సంకల్పం, నిబద్ధత’ అనే విలువలపై పార్టీ కొనసాగుతోందని చెప్పారు. ‘‘బీజేపీ అనేది కుటుంబ ఆధారిత పార్టీ కాదు. ఓ ఫ్యామిలీ చుట్టూ తిరగదు. ప్రజల సంక్షేమం అనే కల్చర్ తోనే నడుస్తుంది. బీజేపీ ఏ ఒక్క ఫ్యామిలీ చుట్టూనో తిరగదు కాబట్టే.. సామాన్యులతో ఎల్లప్పుడూ అనుబంధం కొనసాగించింది. అందుకే పార్టీ ఇప్పుడు ఈ స్థితిలో ఉంది. హామీలను నెరవేర్చడంలో పార్టీ బలంగా ముందుకు సాగుతోంది’’ అని మోడీ అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల నమ్మకాన్ని పార్టీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కరోనా టైంలో బీజేపీ కార్యకర్తల సేవా కార్యక్రమాలను ప్రస్తావించిన ప్రధాని.. తమ పార్టీ ప్రజలకు సేవ చేయడంపైనే దృష్టి పెట్టిందన్నారు. ఢిల్లీలోని ఎన్‌‌డీఎంసీ కన్వెన్షన్ సెంటర్‌‌లో ఆదివారం ఉదయం మొదలైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా మొదట మాట్లాడారు. మోడీ, హోం మంత్రి అమిత్‌‌షా, పలువురు కేంద్ర మంత్రులు సమావేశంలో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల ఎగ్జిక్యూటివ్ మెంబర్లు వర్చువల్​గా పాల్గొన్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఈ మీటింగ్‌లో చాలా ఇంపార్టెన్స్‌ ఇచ్చారు. రాజకీయ తీర్మానాన్ని ఆదిత్యనాథే ప్రవేశపెట్టారు. అసలైతే మిగతా బీజేపీరాష్ట్రాల ముఖ్యమంత్రుల్లాగానే  ఆదిత్యనాథ్‌ కూడా  వర్చువల్‌గా ఈ మీటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే ఎవరూ ఉహించని విధంగా ఆయన ఈ సమావేశానికి హాజరయ్యారు.

పార్టీ బలం పెంచాలె: నడ్డా

బీజేపీ ఆర్గనైజేషన్‌‌ పటిష్టతకు పార్టీ క్యాడర్ అంతా కృషి చేయాలని పార్టీ చీఫ్ జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ‘‘బీజేపీ ఇంకా శిఖరానికి చేరుకోలేదు. కేరళ, తమిళనాడు, ఏపీ, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో తన బలాన్ని విస్తరించాలి’’ అని అమిత్ షా చెప్పినట్లు తెలిపారు. పార్టీ విస్తరణ కోసం పలు లక్ష్యాలను ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 25 నాటికి పార్టీ మొత్తం 10.40 లక్షల పోలింగ్ స్టేషన్లలో బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పారు. వచ్చే ఏప్రిల్ 6 నాటికి ఓటర్ లిస్ట్ ఇన్‌‌చార్జ్‌‌లను ఏర్పాటు చేయాలన్నారు. 1984 అల్లర్ల నిందితులపై చర్యల ప్రక్రియను వేగవంతం చేశారన్నారు. గురుద్వారాలకు విదేశీ గ్రాంట్లను సులభతరం చేశారన్నారు. దేశంలో 80 కోట్ల పేదలకు ఫ్రీ రేషన్ పంపిణీ చేశామన్నారు. బెంగాల్‌‌లో 2014 లోక్‌‌సభ, 2016 అసెంబ్లీ ఎన్నికలు.. 2019 లోక్‌‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికలను పోల్చి చూస్తే పార్టీ గ్రోత్ బాగా కనిపిస్తోందన్నారు.

కరోనా తర్వాత తొలిసారి..

బీజేపీ రాజ్యాంగం ప్రకారం 3 నెలలకు ఒకసారి జాతీయ కార్యవర్గ సమావేశం జరగాల్సి ఉంది. కరోనా వల్ల అది సాధ్యపడలేదు. దేశంలోకి వైరస్ ఎంట్రీ తర్వాత తొలిసారిగా పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌‌కు మోడీ, అమిత్ షా, నడ్డా హాజరయ్యారు. ఎన్నికలు జరగనున్న యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ముఖ్యమంత్రులు, బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్లు ఈ మేరకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. పంజాబ్ స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు.