విమోచన దినంపై రేపు బీజేపీ రౌండ్ టేబుల్ సమావేశం

విమోచన దినంపై రేపు బీజేపీ రౌండ్ టేబుల్ సమావేశం

తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని 22ఏళ్ళుగా బీజేపీ అనేక పోరాటాలు చేసిందని చెప్పారు బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ అధ్యక్షుడు, శ్రీవర్దన్ రెడ్డి. నీళ్ళు నిధులు నియామకాలతో పాటు.. విమోచన దినోత్సవం జరపాలని ఉద్యమ సమయంలో డిమాండ్ చేశామన్నారు. చీమూనెత్తురు ఉంటే విమోచన దినోత్సవం జరపాలని ఉద్యమ సమయంలో డిమాండ్ చేసిన కేసీఆర్.. ఇప్పుడు ఎవరి మెప్పుకోసం సెప్టెంబర్ 17 జరపడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రాంత విలీనానికి సంబంధించి పాఠ్యాంశాల్లోనూ ఎక్కడా ప్రస్తావన లేదన్నారు శ్రీవర్ధన్ రెడ్డి. జలియన్ వాలా భాగ్ లాంటి ఘటనలు తెలంగాణలో ఎన్నో జరిగినా అవి మరుగున పడిపోయాయన్నారు. అసద్ సోదరులకు భయపడి విమోచన దినోత్సవం జరపకపోతే తెలంగాణ ప్రజలు క్షమించరన్నారు. తెలంగాణ కోసం పోరాడిన యోధుల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు.

విమోచన దినోత్సవం అధికారికంగా ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలనీ.. దీనిపై తెలంగాణ అంతటా యువకులతో సదస్సులు నిర్వహిస్తామన్నారు బీజేపీ నేతలు. తెలంగాణలో ముఖ్యఘటనలు జరిగిన ప్రదేశాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రేపు బుధవారం సోమాజీగూడా ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. సెప్టెంబర్17 నాటి కార్యక్రమంలో పాల్గొనేందుకు అమిత్ షా రాబోతున్నారని చెప్పారు. ప్రభుత్వం మరో కోణంతో కాకుండా అమరుల స్మరణ, స్పూర్తి కార్యక్రమంగా చూడాలని కోరారు. విద్య అందని కారణంగా తెలంగాణ వెనుకబడి పోయిందనీ.. ఆ చరిత్రను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో తెలంగాణ వీరుల చరిత్ర దేశ ప్రజలకు తెలిసేలా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామన్నారు