రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై బీజేపీ దృష్టి 

రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై బీజేపీ దృష్టి 

జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత బీజేపీ దూకుడు పెంచింది. కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ఒక్కొక్కటిగా అమలు చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా సునీల్ బన్సల్ ను నియమించిన కమలం పార్టీ.. తాజాగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది.

నియోజకవర్గాలపై దృష్టి..

హైదరాబాద్ లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను బీజేపీ ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికలకు సిద్ధమౌతోన్న బీజేపీ.. రాష్ట్రంలోని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమించేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్ర బీజేపీ ఇంచార్జీగా సునీల్ బన్సల్ నియామకమైన తర్వాత.. వరంగల్ లో నిర్వహించిన పాదయాత్ర ముగింపు సభకు వచ్చారు. వరంగల్ లో రాష్ట్రస్థాయి నేతలతో ఇంట్రాక్ట్ అయిన సునీల్ బన్సల్.. సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుత పార్టీ పరిస్థితి, మిగతా పార్టీల పరిస్థితిపై.. స్థానిక బీజేపీ నేతల నుంచి ఆరాతీసినట్లు కమలం నేతలు చెప్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇప్పటినుంచైనా ఇంచార్జీలను నియమిస్తే.. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి పార్టీ బలోపేతమౌతుందనే అలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే అన్ని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలకు ఇంచార్జీల నియామకంపై కసరత్తు జరుగుతోందని బీజేపీ నేతలు అంటున్నారు.

పార్టీ బలోపేతంపై బీజేపీ ప్లాన్..

అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల ఇంచార్జీలకు సంబంధించిన ఓ లిస్ట్ ఇప్పటికీ రెడీ చేసినట్లు బీజేపీ స్టేట్ ఆఫీస్ లో చర్చ జరుగుతోంది. ఈ వారంలో అన్ని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల ఇంచార్జీలను నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలకు స్థానికులై ఉండని వారిని ఇంచార్జీలుగా బీజేపీ నియమించనుంది. ఆయా నియోజకవర్గాలకు ఇంచార్జీలుగా నియామకమైన నేతలు.. స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాల్సి ఉంటుంది. మొత్తానికి అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమించి.. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలతో కలిసి పోరాటం చేస్తూనే, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.