రాజ్యసభలో తలాక్ బిల్లు..బీజేపీ పక్కా ప్లాన్

రాజ్యసభలో తలాక్ బిల్లు..బీజేపీ పక్కా ప్లాన్

న్యూఢిల్లీ: బీజేపీ వ్యూహం ఫలించింది. ఇన్​స్టంట్​ ట్రిపుల్​ తలాక్​ను  నిషేధిస్తూ రూపొందించిన బిల్లు రాజ్యసభలో గట్టెక్కుతుందా లేదా అన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. సభలో బీజేపీకి పెద్దగా బలం లేకపోవడంతో బిల్లు పాస్​ కాదని రాజకీయ వర్గాల్లో తొలుత చర్చ నడిచింది. అప్పటికప్పుడు చోటుచేసుకున్న పరిణామాలతో పరిస్థితి మారిపోయింది. దీని వెనుక బీజేపీ పకడ్బందీ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. లోక్​సభలో భారీ మెజారిటీతో బిల్లును పాస్​ చేయించుకున్న ప్రభుత్వం.. రాజ్యసభలోనూ తన పట్టును నిలుపుకొంది. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 241. అందులో ఎన్డీయే కన్నా ప్రతిపక్షాలు, తటస్థ పార్టీల బలమే ఎక్కువ.  మొత్తం సభ్యులు సభకు హాజరైతే బిల్లు పాస్​ కావాలంటే 121 మంది (మ్యాజిక్​ ఫిగర్​) మద్దతు కావాలి. ఎన్డీయేకు ఉన్నది 107 మంది సభ్యుల బలమే. ఈ నేపథ్యంలో బిల్లు వీగిపోతుందని అందరూ భావించారు. పైగా మొదటి నుంచి ఎన్డీయేలోని అన్నాడీఎంకే, జేడీయూ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ఆ పార్టీలు సభకు రాకపోతే.. ప్రతిపక్షాల బలం మరింత ఎక్కువై బిల్లు వీగిపోయేది.  కానీ పలు తటస్థ పార్టీలు ఓటింగ్​కు దూరంగా ఉండటం, బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్ష పార్టీల్లోని సభ్యులు కొందరు సభకు రాకపోవడంతో ఒక్కసారిగా మ్యాజిక్​ ఫిగర్​  93కి పడిపోయింది. దీంతో ఎన్డీయేది పైచేయి అయింది.

వ్యతిరేకించిన మిత్రపక్షాలు

ఎన్డీయే కూటమిలోని జేడీయూ, అన్నాడీఎంకే ఈ బిల్లును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి. జేడీయూకు ఆరుగురు, అన్నాడీఎంకేకు 11 సభ్యుల బలం ఉంది. జేడీయూ సభ్యులు సభకు రాకపోగా.. అన్నాడీఎకే సభ్యులు వాకౌట్​ చేశారు. ఫలితంగా ఓటింగ్​ సమయంలో సభలో అధికార ఎన్డీయే బలం 90కి పడిపోయింది. కానీ.. ఏడుగురు సభ్యులున్న నవీన్​పట్నాయక్​ పార్టీ బీజేడీ బిల్లుకు మద్దతుగా ఓటు వేసింది.

వైఎస్సార్సీపీ నుంచి ఒక్కరే వచ్చి వ్యతిరేకించి..

బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్​సీపీ ముందుగానే ప్రకటించింది. ఆ పార్టీకి ఇద్దరు సభ్యులు ఉండగా.. ఓటింగ్​ సందర్భంగా కేవలం విజయసాయిరెడ్డి మాత్రమే హాజరయ్యారు. ఆయన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు.

దూరంగా టీఆర్ఎస్

టీఆర్​ఎస్​కు రాజ్యసభలో ఆరుగురు సభ్యులు ఉన్నారు. చర్చలో, ఓటింగ్​లో వారెవరూ పాల్గొనలేదు. బిల్లును వ్యతిరేకిస్తూ టీడీపీ వాకౌట్​ చేసింది. మొన్నటివరకు టీడీపీకి ఆరుగురు సభ్యులు ఉండగా నలుగురు ఇటీవలే బీజేపీలో విలీనమవగా.. మిగిలిన ఇద్దరు సభ్యుల్లో ఒక్కరు మాత్రమే మంగళవారం సభకు హాజరై.. వాకౌట్​ చేశారు.

ప్రతిపక్ష సభ్యుల్లో చీలిక

యూపీఏ కూటమిలోని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్​ నుంచే నలుగురు సభ్యులు సభకు దూరంగా ఉన్నారు. అందులో ఆస్కార్​ ఫెర్నాండెజ్​ వంటివారు ఉన్నారు. ఇక ఎన్సీపీ చీఫ్​ శరద్​ పవార్​, ఆ పార్టీ ఎంపీ ప్రఫుల్​ పటేల్​ కూడా సభకు రాలేదు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి చెందిన ఇద్దరు సభ్యులు, సమాజ్​వాదీ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, ఆర్జేడీకి చెందిన రాంజఠ్మలానీ కూడా ఓటింగ్​కు దూరంగా ఉన్నారు. మొత్తంగా ఆరు పార్టీలు ఓటింగ్​కు దూరంగా ఉండగా.. ప్రతిపక్షంలోని పలువురు సభ్యులు కూడా గైర్హాజరయ్యారు. ఇలాంటి పరిణామాల్లో ఓటింగ్​ సమయానికి సభలో 183 మంది సభ్యులే ఉన్నారు. 99 మంది అనుకూలంగా.. 84 మంది వ్యతిరేకంగా ఓటు వేయడంతో బిల్లు పాస్​ అయింది. బిల్లును వ్యతిరేకించే మిత్రపక్షాలు అన్నాడీఎంకే, జేడీయూలను ఓటింగ్​కు దూరంగా ఉంచడంలో, పలు పార్టీలను కూడా సభకు రాకుండా చేయడంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని, అందుకే సభలో మ్యాజిక్​ ఫిగర్​  పడిపోయి బిల్లుకు గ్రీన్​సిగ్నల్​ లభించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వ్యతిరేకించే పార్టీలన్నీ ఓటువేసి ఉంటే.. బిల్లు గట్టెక్కేది కాదని చెప్తున్నారు. గత వారం ఆర్టీఐ యాక్ట్​ విషయంలోనూ రాజ్యసభలో ఇలాంటి స్ట్రాటజీనే బీజేపీ ఉపయోగించింది. అప్పుడు కొన్ని తటస్థ పార్టీలకు ఆ పార్టీ చీఫ్​ అమిత్​ షా ఫోన్​ చేసి బిల్లుకు మద్దతు కూడగట్టారు.