ఎన్నికల కమిషన్ గులాబీ కండువా కప్పుకుంది

ఎన్నికల కమిషన్ గులాబీ కండువా కప్పుకుంది

బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ లక్ష్మణ్

ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి నిరసనగా బీజేపీ దీక్ష

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి నిరసనగా బీజేపీ  నాయకులు పవాస దీక్ష చేపట్టారు. బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షలో పార్టీ సీనియర్ నేతలు వివేక్ వెంకటస్వామి, డీకే అరుణ, తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ కు కొన్ని గంటల ముందు అధికార పార్టీ నాయకులు పోలీసులను పెట్టుకుని విచ్చలవిడిగా డబ్బులు.. మద్యం పంపిణీ చేశారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీ తీరును వ్యతిరేకిస్తూ గాంధేయ మార్గంలో దీక్ష చేపట్టినట్లు బీజేపీ నేతలు ప్రకటించారు.

గ్రేటర్ ఎన్నికలను ప్రశాంతంగా స్వేచ్చగా జరపాల్సిన ఎన్నికల కమిషన్ గులాబీ కండువా కప్పుకుని ఏకపక్షంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ లక్ష్మణ్ ఆరోపించారు. దీక్ష ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ కు కంచుకోట గా ఉన్న దుబ్బాక లో బీజేపీ గెలవడంతో జీర్ణించుకోలేక పోతున్నారని.. అందుకే గ్రేటర్ ఎన్నికలను ఆదర బాదరగా ఎన్నికలు నిర్వహిస్తోందన్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ కూడా అధికార పార్టీ కి అనుకూలంగా వ్యవహరిస్తూ.. టీఆర్ఎస్ పార్టీ కీ తొత్తుగా మారిందని.. గులాబీ కండువా కప్పుకున్నట్లు కుట్ర పూరితంగా వ్యవరిస్తోందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ రౌడీలు, ఎంఐఎం గుండాలు సంజయ్ పై దాడికి ప్రయత్నాలు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. తండ్రీ కొడుకులు అధికార దుర్వినియోగం తో గెలవాలని చూస్తున్నారని.. అయితే  ప్రజలు మాత్రం అన్ని విషయాలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ లోని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని..  కేసీఆర్ కుటుంబ పాలన వద్దనుకుంటున్నారని..  అధికార పార్టీ కి తగిన బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.

బండి సంజయ్ ను హత్య చేసేందుకు ప్లాన్ చేశారు: డీకే అరుణ

గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకుని విచ్చల విడిగా డబ్బు, మద్యాన్ని పంచుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని.. అడుగడుగునా అడ్డుపడుతున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను హత్య చేసేందుకు ప్లాన్ చేశారని  బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురులు డీకే అరుణ ఆరోపించారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ తీరును వ్యతిరేకిస్తూ చేపట్టిన దీక్షలో ఆమె పాల్గొని మాట్లాడారు. అధికార యంత్రాంగం మొత్తం టీఆర్ఎస్ కు తొత్తులుగా మారారని..  మైలార్ దేవ్ పల్లి లో ఎమ్మెల్యే  నే తన అనుచరులు తో  బీజేపీ కార్యకర్తల పై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. నిన్న రాత్రి  నెక్లెస్ రోడ్డు లో టీ తాగి వెళ్తున్న సంజయ్ పై దాడికి ప్రయత్నాలు చేశారని.. అంత జరుగుతున్నా అక్కడ  ఒక్కరిద్దరు పోలీసులు తప్ప ఎలాంటి పోలీస్ ఫోర్స్ లేదన్నారు. సంజయ్ ను హత్య చేసేందుకు ప్లాన్ చేశారని ఆమె ఆరోపించారు. బండి సంజయ్ ను అడ్డుకుని దాడ చేసిన వారి పై ఇంత వరకు కేసులు నమోదు చేయలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకూ సిద్ధంగా ఉన్నారని.. ప్రజలు అందరూ  స్వేచ్ఛగా ఓటు వేయాలని డీకే అరుణ పిలుపునిచ్చారు.