సెప్టెంబర్ 7న బీజేపీ ఆందోళనలు

సెప్టెంబర్ 7న బీజేపీ ఆందోళనలు

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 7న చలో హైదరాబాద్ మిలియన్ మార్చ్ కార్యక్రమాలకు బదులుగా.. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. పార్టీ క్యాడర్ హైదరాబాద్ తరలి రాకుండా ఆయా జిల్లాల వారీగా ఎక్కడి వారు అక్కడే ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఆందోళనలు నిర్వహించేలా ప్లాన్ చేసుకోవాలని సూచించింది. బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్​చార్జ్ ప్రకాశ్ జవదేకర్ శనివారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో భాగంగా ఆందోళనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల వరకు జవదేకర్ ఇక్కడే ఉండనున్నారు.

 బంజారా హిల్స్​లో ఆయన తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచే రాష్ట్ర పార్టీ ముఖ్యులతో భేటీలు నిర్వహిస్తున్నారు. పార్టీ తరఫున పోటీ చేసే వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ ముగిసిన తర్వాత (10వ తేదీ తర్వాత)ఉమ్మడి జిల్లాల వారిగా అసెంబ్లీ కోర్ కమిటీల సమావేశం జరపాలని నిర్ణయించారు. ఇందులో దరఖాస్తులపై సమీక్ష, బస్సు యాత్రలు, సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవ కార్యక్రమంపై చర్చించనున్నారు.