సీబీఐతో ఎంక్వైరీ జరిపించాలి : లక్ష్మణ్

సీబీఐతో ఎంక్వైరీ జరిపించాలి : లక్ష్మణ్
  • పదేండ్లలో కేసీఆర్​ చేసిన అరాచకాలన్నీ వెలికితీయాలి: లక్ష్మణ్​
  • ఫోన్ ట్యాపింగ్​పై సీఎం మౌనం ఎందుకు? 
  • కాళేశ్వరం స్కామ్​పై చర్యలేవీ?
  • తెలంగాణలో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని కామెంట్​

న్యూఢిల్లీ, వెలుగు : ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ డిమాండ్​ చేశారు. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు వ్యవహారంపై ఢిల్లీ పెద్దల ఒత్తిడికి సీఎం రేవంత్ రెడ్డి లొంగిపోయారా? అని  ప్రశ్నించారు. ఇందులో తానూ బాధితుడినేనని చెప్పుకున్న రేవంత్​.. ఇప్పుడు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారో తెలియడం లేదని అన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా వ్యవహరించిన గత ప్రభుత్వ పెద్దలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. 

అవసరమైతే ఈ అంశంపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. బుధవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో పీకల లోతులో కూరుకుపోయిన బిడ్డ కవితను కాపాడుకునేందుకు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్​కు పాల్పడ్డారని ఆరోపించారు. ఏదోరకంగా ఢిల్లీ బీజేపీ పెద్దలను ఇరికించి, కవితను గట్టెక్కించుకోవాలని కేసీఆర్ కుట్ర పన్నారని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఒక కట్టుకథని కొట్టిపారేశారు. ఫోన్ ట్యాపింగ్​తో ఆగకుండా బ్రౌజింగ్ హిస్టరీ, వాయిస్​ కాల్స్, నెట్​వర్క్ కాల్స్​ను ట్రాక్ చేసినట్టు తెలుస్తున్నదని చెప్పారు. 

రాజకీయ ప్రయోజనాల కోసం నేతలు, జర్నలిస్టులు.. చివరకు జడ్జిల ఫోన్లను ట్యాప్​ చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ఇంతలా ప్రజల వ్యక్తిగత హక్కును కాలరాసే అధికారం కేసీఆర్​కు ఎవరిచ్చారని ఫైర్ అయ్యారు. అక్రమ సంపాదన కోసం కూడా పోలీసు వ్యవస్థను బీఆర్ఎస్ దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. కేసీఆర్, హరీశ్​రావు పేర్లను నిందితులు వాంగ్మూలంలో ప్రస్తావించారని చెప్పారు. గత పదేండ్లలో కేసీఆర్ ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారని, అవన్నీ వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్​పై సీబీఐ విచారణకు ఆదేశించకుండా కాంగ్రె స్ ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తున్నదని అడిగారు. 10 జన్ పథ్ నుంచి వచ్చిన ఆదేశాలతో సీబీఐ విచా రణ పక్కనపెడితే.. బీఆర్ఎస్​కు పట్టిన గతే కాంగ్రెస్​కు కూడా పడుతుందని హెచ్చరించారు.

రాష్ట్రంలో రాజకీయ మార్పులు

లోక్​సభ ఎన్నికల రిజల్ట్స్​తర్వాత తెలంగాణలో అనేక రాజకీయ మార్పులు రాబోతున్నాయని లక్ష్మ ణ్ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చ ని తెలిపారు. అది అంతర్గతంగా జరుగుతుందా? లేక బయటి నుంచి జరుగుతుందా? అనేది తాను చెప్పలేనని అన్నారు. ఒకవేళ ఎన్నికలు వస్తే బీజేపీ అధికారంలోకి వస్తుందని లక్ష్మణ్​ ధీమా వ్యక్తం చేశారు. 

అయితే, ఒక ప్రజాస్వామ్యవాదిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేండ్లు కొనసాగాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల్లో రెండంకెల సీట్లను బీజేపి గెలుచుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్​లో బీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్​లో కాంగ్రెస్ విలీనం అవుతుందని కామెంట్ చేశారు. రాష్ట్ర గీతంగా అందెశ్రీ రాసిన పాటను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. కీరవాణి సంగీతాన్ని సమకూర్చడం అనేది టెక్నికల్​ ఇష్యూ అని, దానిపై తాను కామెంట్​ చేయబోనని తెలిపారు. రాష్ట్ర లోగో మార్పు వ్యవహారంపై ఇప్పుడే స్పందించబోనని, అందులో ఏమైనా లోపాలుంటే తప్పక పోరాడుతామని చెప్పారు. 

కాళేశ్వరం స్కాంపై చర్యలేవీ?

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పదేండ్ల పాలనలో కేసీఆర్ చేసిన స్కాం​లను వెలికి తీస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని.. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్నే విస్మరించారని లక్ష్మణ్ అన్నారు. కాళేశ్వరం స్కాం​పై చర్యలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్న పత్రాల లీకేజీలో అసలైన బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అడిగారు. పోటీపరీక్షల ప్రశ్నపత్రాలతో లక్షలాది మంది యువ తకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు.