ఫిబ్రవరి 20 నుంచి బీజేపీ రథయాత్రలు

ఫిబ్రవరి 20 నుంచి బీజేపీ రథయాత్రలు
  •    ఐదు పార్లమెంట్ క్లస్టర్లలో ప్రారంభానికి ఏర్పాట్లు 
  •     ‘విజయ సంకల్ప యాత్ర’ పేరుతో ఈ నెల 29 వరకు నిర్వహణ

హైదరాబాద్, వెలుగు: రాబోయే లోక్ సభ ఎన్నికల్లో స్టేట్​లో మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ రథ యాత్రలకు సిద్ధమైంది. “విజయ సంకల్ప యాత్ర” పేరుతో ఈ నెల 20 నుంచి 29 వరకు జనంలోకి వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాలను ఐదు క్లస్టర్లుగా విభజించింది. ఈ ఐదు క్లస్టర్లకు శాతవాహన, కాకతీయ, కృష్ణ, కొమురం భీం, భాగ్యనగరం పేర్లను ఖరారు చేశారు. ఒక్కో క్లస్టర్ లో మూడు నుంచి నాలుగు సెగ్మెంట్లు ఉన్నాయి. ఐదు క్లస్టర్లలో ఒకే రోజు యాత్రలు ప్రారంభం కానున్నాయి.

ఈ యాత్రల కోసం బీజేపీ ప్రత్యేకంగా ఐదు బస్సులను తయారు చేయించింది. కృష్ణ క్లస్టర్ లో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ సెగ్మెంట్లు.. శాతవాహన క్లస్టర్ లో కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల.. కాకతీయ క్లస్టర్ లో వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం.. కుమ్రం భీం క్లస్టర్​లో ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి.. భాగ్యనగరం క్లస్టర్ లో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి.. భువనగిరి లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. గత పదేండ్లలో రాష్ట్రానికి మోదీ సర్కార్ కేటాయించిన నిధులు, రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర పథకాలు, గత బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణకు చేసిన అన్యాయం, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ గ్యారంటీల పేరుతో ప్రభుత్వాన్ని మోసగిస్తున్న తీరును ఈ రథ యాత్రల్లో రాష్ట్ర నేతలు జనాలకు వివరించనున్నారు. ‘‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’’ నినాదంతో బీజేపీ నేతలు ప్రజల్లోకి వెళ్లనున్నారు. రాష్ట్ర నేతలతో పాటు జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. ఈ యాత్రలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆదివారం బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి మీడియాకు వెల్లడించనున్నారు. 

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా 17 మంది నియామకం

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా మరో 17 మందిని పార్టీ స్టేట్​ చీఫ్​ కిషన్ రెడ్డి శనివారం నియమించారు. ఇందులో 12 మంది ఇటీవల పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉద్వాసనకు గురైన వారు ఉండగా.. మరో ఐదుగురు రాష్ట్ర మోర్చా అధ్యక్షులుగా పనిచేసి పదవులను కోల్పోయిన వారు ఉన్నారు. వీరి సేవలను ఈ పదవుల ద్వారా పార్టీకి వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. లోక్ సభ ఎన్నికల వేళ పదవులు కోల్పోయిన వారు పార్టీపై అసంతృప్తి చెందకుండా రాష్ట్ర నాయకత్వం వీరందరిని రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.