ఇద్దరు పిల్లలను చంపి తండ్రి సూసైడ్. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో ఘటన

ఇద్దరు పిల్లలను చంపి తండ్రి సూసైడ్. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో ఘటన
  •     భార్య లేక పిల్లల ఆలనా పాలనా కష్టమై అఘాయిత్యం
  •     నారాయణపేట జిల్లా మరికల్​ మండలం తీలేరులో విషాదం

మరికల్, వెలుగు: భార్య లేక పిల్లల పోషణ భారమై ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణపేట జిల్లా మరికల్​ మండలం తీలేరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. సీఐ రాజేందర్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తీలేరు గ్రామానికి చెందిన శివరాం(33)కు ఇదే జిల్లా ఊట్కూర్  మండలం పెద్దజట్రం గ్రామానికి చెందిన సుజాతతో తొమ్మిదేండ్ల కింద వివాహమైంది. 

గ్రామంలో ఉపాధి లేక భార్యాభర్తలిద్దరూ పెళ్లైన కొన్నాళ్లకే హైదరాబాద్​కు వలస వెళ్లారు. వీరికి కూతురు రితిక(8), కొడుకు చైతన్య(6) ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. కొడుకు చైతన్య పుట్టిన మూడు నెలలకే పిల్లలను భర్త వద్దే వదిలేసి భార్య సుజాత పుట్టింటికి వెళ్లిపోయింది. ఆరేండ్ల కింద ఇద్దరూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా.. గత ఏడాది మార్చిలో విడాకులు మంజూరయ్యాయి. 

కొద్ది రోజుల కింద శివరాం తన ఇద్దరు పిల్లలను తీసుకుని హైదరాబాద్​ నుంచి సొంతూరుకు వచ్చి డ్రైవింగ్​ చేస్తూ బతుకుతున్నాడు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో రితిక నాల్గో తరగతి, చైతన్య ఒకటో తరగతి చదువుతున్నారు. ఈక్రమంలో సోమవారం రాత్రి పిల్లలను ఆస్పత్రికి తీసుకెళ్తానని తల్లిదండ్రులకు చెప్పిన శివరాం పిల్లలను బైక్​పై ఎక్కించుకొని మరికల్​కు వచ్చాడు. 

 రాత్రి 10 గంటల ప్రాంతంలో శివరాం తన పిల్లలను గ్రామ సమీపంలో ఉన్న తన పొలం వద్దకు తీసుకెళ్లి పడుకోబెట్టాడు. ఆ తర్వాత ఒక్కొక్కరిని లేపి గొంతుకు తాడు బిగించి హత్య చేశాడు. ఇద్దరు చిన్నారులు చనిపోయాక వారిని సమీపంలో ఉన్న కాలువలో పడేశాడు. ఆ తర్వాత తాను గడ్డి మందు తాగి, ట్రాన్స్​ఫార్మర్  పట్టుకున్నాడు. 

కరెంట్​ షాక్​తో తీవ్రంగా గాయపడిన శివరాం తనను కాపాడాలని స్నేహితులకు ఫోన్​ చేసి చెప్పాడు. వెంటనే కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు వెళ్లి పిల్లలు ఏరని అడగగా, చంపి కాలువలో పడేశానని, తాను చనిపోదామనుకున్నానని తెలిపాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా గాయాలతో ఉన్న శివరాంను మహబూబ్​నగర్​ జనరల్​ హాస్పిటల్​కు తరలించారు. 

పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్​ ఉస్మానియా హాస్పిటల్​కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మంగళవారం తెల్లవారుజామున చిన్నారుల డెడ్​బాడీలను కాలువలో నుంచి బయటకు తీశారు. సీఐతో పాటు ఎస్సై రాము ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.