సోయా చుట్టూ రాజకీయం.. వారం రోజులుగా బీఆర్ఎస్ నిరసనలు

సోయా చుట్టూ రాజకీయం..  వారం రోజులుగా బీఆర్ఎస్ నిరసనలు
  • రంగుమారిన సోయా కొనాలని డిమాండ్
  • పంట అమ్ముకునేందుకు రైతుల ఎదురుచూపులు
  • ఈ ఏడాది అధిక వర్షాలతో రంగు మారిన పంట
  • ఆదిలాబాద్​ జిల్లాలో సాగైన సోయా   72 వేల ఎకరాలు
  • రైతులు 24 వేల మంది అంచనా దిగుబడి 6 లక్షల క్వింటాళ్లు
  • ఇప్పటివరకు కొనుగోలు చేసింది1.50 లక్షల క్వింటాళ్లు

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో సోయా చుట్టూ రాజకీయం నడుస్తోంది. జిల్లా వ్యాప్తంగా పత్తి తర్వాత రైతులు అధికంగా సోయా సాగు చేస్తారు. వర్షాకాలం సాగులోనే ఈ పంటలు వేస్తారు. అయితే ఈ ఏడాది అధిక వర్షాలు అన్నదాతను నిలువునా ముంచాయి. ఓ పక్క పత్తి దిగుబడులు తగ్గిపోయి రైతులు నష్టపోతే.. మరోవైపు సోయా రంగు మారి నాణ్యత దెబ్బతిన్నది. కోత దశలో వర్షాలు పడటంతో రంగు మారింది. పంట కోతలు పూర్తిచేసినప్పటికీ నెల రోజుల పాటు కొనుగోళ్లలో ఆలస్యం జరిగింది.

ఈ క్రమంలోనే ఇంట్లో నిల్వ ఉంచిన సోయలను రైతుల మార్కెట్ కు తీసుకెళ్తే రంగు మారి నాణ్యత లేదనే నిబంధనలతో 15 రోజుల క్రితమే కొనుగోళ్లను మార్క్ ఫెడ్ నిలిపివేసింది. ఇదివరకు కొన్ని చోట్ల కొనుగోళు చేసి గోదాంకు తరలించినప్పటికీ వాటిని సీడబ్ల్యూసీ గోదాం అధికారులు తిరిగి పంపిస్తున్నారు. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. చేసేదిలేక కొంతమంది తక్కువ ధరకే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. మద్దతు ధర క్వింటాల్​కు రూ. 5,328 ఉండగా ప్రైవేట్​లో రూ.4 వేలకే అమ్ముతున్నారు. ఇప్పటివరకు అధికారులు స్పష్టతనివ్వకపోవడంతో అసలు సోయాను కొనుగోలు చేస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. 

ఆదిలాబాద్​లో బీఆర్ఎస్.. హైదరాబాద్​లో బీజేపీ

సోయా కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరి పట్ల గత వారం రోజుల నుంచి జిల్లాలో బీఆర్ఎస్ నిరసనలు తెలుపుతోంది. ఇదిలా ఉంటే మూడు రోజుల క్రితం అఖిల పక్షం రైతు సంఘం, రైతులు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ హైదరాబాద్ లో అసెంబ్లీని ముట్టడించారు. సోయా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. మరోపక్క ఆదిలాబాద్​లో బీఆర్ఎస్ నేతలు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే ఇంటి ముట్టడించారు. కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. తాజాగా మంగళవారం ఆదిలాబాద్ పట్టణ బంద్ చేపట్టారు.

మాజీ ఎమ్మెల్యే జోగురామన్న ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆందోళన చేశారు. రంగు మారిన పంటను మద్దతు ధరకే కొనుగోలు చేయాలని, గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం 20 శాతం కొనుగోలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 80 శాతం కొనుగోలు చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు వెనుకడుగు వేస్తోందని ప్రశ్నిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నిరసనలపై బీజేపీ సైతం విమర్శలు చేస్తోంది. రాజకీయ లబ్ధి కోసమే ధర్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కలిసి రంగు మారిన సోయ పంట కొనుగోలు చేయాలని వినతి పత్రం అందజేశారు.

 రంగుమారిన సోయాను ప్రభుత్వమే కొనాలి

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: అధిక వర్షాల కారణంగా రంగు మారిన సోయా పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పాయల్​శంకర్​ మంగళవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ.. ఆదిలాబాద్ వ్యవసాయంపై ఆధారపడిన జిల్లా అని.. సోయాబీన్ ముఖ్య పంటగా, రైతులకు ఆదాయ వనరుగా ఉందన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఎఫ్ఏక్యూ(ఫెయిర్​ యావరేజ్​ క్వాలిటీ) నిబంధనల ప్రకారం రంగు మారిన సోయాబీన్ కొనుగోలుకు అర్హత లేకపోవడం వల్ల రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి, రంగు మారిన సోయాబీన్ కొనుగోలులో వచ్చే నష్టాన్ని 50 శాతం వరకు భరించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రైతులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారి నష్టం భరించి, రంగు మారిన సోయాను కొనుగోలు చేయాలని కోరారు. 

సోయాను కొనుగోలు చేయాలి

ప్రభుత్వం రైతులు పండించిన సోయా పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలి. అధిక వర్షాల కారణంగా పంట కొంచెం రంగు మారింది. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కొనుగోళ్లు చేపట్టాలి. ఇదివరకు కొన్న పంటకు సంబంధించిన డబ్బులు కూడా గత నెల 3వ తేదీ వరకు మాత్రమే పడ్డాయి. తర్వాత అమ్మిన రైతులకు పైసలు రాలేదు. వెంటనే జమ చేయాలి. - యాళ్ల ఇంద్రారెడ్డి, రైతు, ధన్నూర్(బి)

పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి

నాకున్న నాలుగెకరాల భూమితో పాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకొని సోయా సాగు చేశాను. పెట్టుబడి కోసం దాదాపుగా రూ.3లక్షల వరకు ఖర్చయ్యింది. 70 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఏకదాటి వర్షాలతో రంగు మారింది. పంట చేతికొచ్చి రెండు నెలలు కావస్తోంది. మార్కెట్ ​యార్డులో నిల్వ ఉంచాము. నెల రోజులుగా నిత్యం మార్కెట్​కు తీసుకెళ్తున్నా  పంటను కొనుగోలు చేయడం లేదు. పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని పూర్తి పంటను కొనాలి. - కొటాటి సాగర్​, సోయా రైతు, కన్గుట్ట