- సోమవారం ఐదుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరిక
- మరికొందరు క్యూలో ఉన్నారని ప్రచారం
- రంగంలోకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
ఖమ్మం, వెలుగు: మున్సిపల్ ఎన్నికలకు ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీలోని చిక్కుముళ్లను సరి చేసుకోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టిపెట్టారు. ఖమ్మం కార్పొరేషన్ లో పార్టీ కార్పొరేటర్లు చేజారకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. 2023లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మేయర్ సహా పలువురు కార్పొరేటర్లు కారు దిగి, హస్తం గూటికి వెళ్లడంతో మేయర్ పీఠాన్ని చేజార్చుకుంది. ఆ తర్వాత కూడా విడతల వారీగా కొందరు కార్పొరేటర్లు జంప్ అయ్యారు. తాజాగా సోమవారం ఐదుగురు మహిళా కార్పొరేటర్లు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
మరో నలుగురు ఐదుగురు కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీంతో పార్టీ పరిస్థితిని చక్కబెట్టేందుకు స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగారు. జంపింగ్ లకు చెక్ పెట్టడంతో పాటు, కార్పొరేటర్లలో మానసిక స్థైర్యాన్నిచ్చేలా పర్యటన ప్లాన్ చేశారు. మున్సిపల్ ఎన్నికలకు ముఖ్య కార్యకర్తలను సమాయత్తం చేయడమే లక్ష్యంగా ఇవాళ కేటీఆర్ ఖమ్మం వస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్ లను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన సన్మానించనున్నారు.
43 నుంచి 17కి పడిపోయిన కార్పొరేటర్ల బలం..!
2021లో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ను అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెల్చుకుంది. అప్పటి ఎలక్షన్లలో బీఆర్ఎస్, సీపీఐ పొత్తుగా పోటీ చేయగా, కాంగ్రెస్, సీపీఎం జతకట్టాయి. మొత్తం 60 డివిజన్లకు గాను బీఆర్ఎస్ 43, సీపీఐ 3 చోట్ల విజయం సాధించగా, కాంగ్రెస్ 9, సీపీఎం 2, బీజేపీ 1, ఇండిపెండెంట్లు 2 చోట్ల విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి పునుకొల్లు నీరజ మేయర్ గా ఎన్నికయ్యారు.
ఆ తర్వాత ముగ్గురు కాంగ్రెస్ కార్పొరేటర్లు బీఆర్ఎస్ లో చేరడంతో పార్టీ బలం 45కు పెరిగింది. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల కు ముందు నుంచి పరిస్థితి తలకిందులైంది. ఎలక్షన్లకు ముందు డిప్యూటీ మేయర్ తో పాటు 10 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. ఎలక్షన్ల తర్వాత దశల వారీగా బీఆర్ఎస్ ను వీడిన కార్పొరేటర్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు జై కొట్టారు.
పార్లమెంట్ ఎన్నికలకు ముందు మేయర్ పునుకొల్లు నీరజతో పాటు మరికొందరు కూడా జంప్ కావడంతో కార్పొరేషన్ చేజారింది. తాజాగా సోమవారం కాంగ్రెస్ లో చేరిన ఐదుగురితో కలుపుకొని కార్పొరేషన్ లో హస్తం పార్టీ బలం 39కి పెరగ్గా, ప్రస్తుతం బీఆర్ఎస్ తో పాటు ఉన్న కార్పొరేటర్ల సంఖ్య 17 తగ్గింది. వీరిలో కూడా మరో నలుగురైదుగురు కాంగ్రెస్ ముఖ్య నేతలతో టచ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
కేటీఆర్ ముందున్న సవాల్ ఇదే..
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పూర్తిగా చతికిలబడింది. 10 స్థానాలకు గాను కేవలం భద్రాచలంలో మాత్రమే విజయం సాధించింది. ఆయన కూడా కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ఓట్ల శాతాన్ని కోల్పోయింది. మేయర్, మున్సిపల్ చైర్మన్లు పార్టీ మారడంతో ఖమ్మం కార్పొరేషన్, వైరా మున్సిపాలిటీలనూ చేజార్చుకుంది.
మొన్నటి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 1,035 గ్రామ పంచాయతీలకు గాను పార్టీ మద్దతుదారులు 219 చోట్ల విజయం సాధించారు. ఆ తర్వాత వీరిలో కూడా కొందరు కాంగ్రెస్ లో చేరారు. వైరాలో గత ఎన్నికల్లో పోటీ చేసిన మదన్ లాల్ చనిపోగా, ఆ తర్వాత అక్కడ ఇన్చార్జిపై ఇంతవరకు స్పష్టత లేదు. భద్రాద్రి జిల్లాలో పలు చోట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇంచార్జిలకు మధ్య విభేదాలు ఇటీవల బయటపడ్డాయి. ఈ సమస్యలను చక్కదిద్దడంతో పాటు త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు పార్టీ కేడర్ ను సమాయత్తం చేయడం కేటీఆర్ కు సవాల్ గా మారింది.
