కార్యకర్తలు కష్టపడి పనిచేయాలి: బండి

కార్యకర్తలు కష్టపడి పనిచేయాలి: బండి
  • భారీగా తరలివచ్చిన జనం
  • హైకోర్టు డైరెక్షన్​లో సాగిన మీటింగ్​

భైంసా/కుభీర్,వెలుగు: భైంసాలో మంగళవారం నిర్వహించిన బీజేపీ బహిరంగ సభ సక్సెస్​ అయ్యింది. జనం పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో పరిసరాలన్నీ కిటికిటలాడాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ​ప్రసంగం కార్యకర్తల్లో జోష్​ నింపింది. 

ఉదయం నుంచి సాయంత్రం వరకు..

కాషాయ దళపతి సంజయ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీగా గడిపారు. స్థానిక సీనియర్ లీడర్ రామారావు పటేల్ ఇంటికెళ్లి టీ తాగారు. స్థానిక రాజకీయ పరిస్థితులపై దాదాపు గంటకుపైగా చర్చించారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, హిందూవాహిని, అనుబంధ సంస్థల లీడర్లతో మాట్లాడారు. భైంసా అల్లర్ల బాధితులతో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహ, ప్రతి వ్యూహాలపై చర్చించారు. కార్యకర్తల అభిప్రాయాలను నోట్​ చేసుకున్నారు. ధైర్యంగా పని చేయాలని, ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి ఒకటి... ఇక నుంచి మరొకటి అని భుజం తట్టారు.

మధ్యాహ్నం 3.15 గంటలకు సభాస్థలికి..

కార్యకర్తలు, లీడర్లతో బిజీగా గడిపిన సంజయ్​ మధ్యాహ్నం 3.15 గంటలకు సభాస్థలికి చేరుకున్నారు. జిల్లా, రాష్ట్రస్థాయి నాయకులు, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరుల ప్రసంగాల అనంతరం బండి సంజయ్ మాట్లాడారు. సభ ప్రారంభం నుంచి ముగిసే వరకు భారత్​ మాతాకీ జై.. జై శ్రీరాం నినాదాలతో మార్మోగింది. ప్రధానంగా సంజయ్ రామ లక్ష్మణ జానకీ.. జైబోలో హనుమాన్​కీ అంటూ నినాదాలు చేశారు. సభకు యువకులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో భైంసాలో జోష్ ఎక్కువని.. ఇక్కడి యూత్ జోష్​ కేసీఆర్ గడీలను బద్దలు కొట్టబోతుందన్నారు. సభ జరిగే వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకపోవడంతో బీజేపీ లీడర్లు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 

భారీ బందోబస్తు...

భైంసా సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏఎస్పీ కిరణ్ ఖారే ఆధ్వర్యంలో జిల్లాలోని పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. సభ సక్సెస్ కోసం యాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్​రావు పటేల్, లీడర్​రామారావు పటేల్ చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి.

జాబిర్ అహ్మద్ ను ఎందుకు అరెస్టు చేస్తలే..

భైంసా అల్లర్ల కేసులో ఏ1గా ఉన్న మున్సిపల్ వైస్ చైర్మన్ జాబిర్ అహ్మద్ ను ఎందుకు అరెస్టు చేయడంలేదని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి ప్రశ్నించారు. భైంసాలో జరిగిన సభలో ఆమె మాట్లాడారు. ఇటీవల టిప్పు సుల్తాన్ ర్యాలీ వెయ్యి మందితో జరిగితే భారీ బందోబస్తు కల్పించిన పోలీసులు, తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సభకు అనుమతి ఎందుకు నిరాకరించారని నిలదీశారు.